ఒక్క రోజులో 183 సార్లు.. రెండు వారాల్లో 900 సార్లు.. ఏమిటీ భూకంపాలు!

అవును... జపాన్ లోని టొకార దీవుల్లో జూన్ 21 నుంచి భూఫలకాల కదలికలు చురుగ్గా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.;

Update: 2025-07-03 10:09 GMT

సాధారణంగా భూకంపాలు కొన్ని ప్రాంతాల్లో అత్యంత అరుదుగా, మరికొఇన్ని చోట్ల అప్పుడప్పుడూ, ఇంకొన్ని చోట్ల కాస్త తక్కువ గ్యాప్ లోనే వస్తుంటాయి! కానీ జపాన్ లో మాత్రం అదేమిటో.. భూమి నిత్యం కదులుతున్నట్లుగానే అనిపిస్తుంటుందని అంటున్నారు. ప్రధానంగా జూన్ 21 నుంచి భూఫలకాల కదలికలు చురుగ్గా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో.. మరో సునామీ టెన్షన్ తెరపైకి వచ్చింది!

అవును... జపాన్ లోని టొకార దీవుల్లో జూన్ 21 నుంచి భూఫలకాల కదలికలు చురుగ్గా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఇక్కడ 5.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని వెల్లడించారు. సరాసరిగా రెండు వారాల వ్యవధిలో గంటకు సగటున మూడు కంటే ఎక్కువసార్లు భూమి కంపించిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయం షాకింగ్ గా మారింది.

ఈ నేపథ్యంలో అక్కడ బుధవారం సునామీ హెచ్చరికలు జారీ చేసినా.. ఆ తర్వాత వాటిని ఆపేశారు. మరోవైపు అత్యవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గత రెండు వారాల వ్యవధిలో జపాన్ లో సంభవించిన భూకంపాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఆ సంఖ్య అక్షరాలా 900 కావడం గమనార్హం!

ఈ క్రమంలో జూన్ 23న అత్యధికంగా ఒక్కరోజులోనే 183 సార్లు భూమి కంపించిందని జపాన్‌ వాతావరణశాఖ ఏజెన్సీ అధికారి అయాటకా ఎబిటా పేర్కొన్నారు. గత ఏడాది ఇదే దీవుల్లో 346 సార్లు భూమి కంపించిందని తెలిపారు. కానీ.. గత రెండు వారాల్లొనే అంతకు సుమారు మూడు రెట్లు అన్నట్లుగా భూమి కంపించిందని వెల్లడించారు.

అయితే... ఈ టొకార దీవుల్లో జనావాసాలు తక్కువగా ఉండటం కొంచెం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 12 దీవులు ఉండగా.. వాటిలో ఏడుచోట్లే ప్రజలు నివశిస్తున్నారు. వీరి సంఖ్య సుమారు 700 మంది కావడంతో.. ఇక్కడివారిని ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా అధికారులు ప్రణాలికలు సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా... జపాన్ - ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా భారీ విపత్తు సంభవించొచ్చని.. ఇది భారీ సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చని.. దీని తీవ్రత 2011లో భూకంపం వల్ల ఏర్పడిన అలలకంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ బాబా వంగ జోస్యాలు హల్ చల్ చేస్తున్నాయి!

కాగా... ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే ప్రదేశాల్లో జపాన్‌ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అనే ప్రదేశంలోని ప్రధాన భూ ఫలకాలపై ఈ దేశం ఉండటమే అందుకు కారణం! అయితే... గత రెండు వారాల్లో ఈ స్థాయిలో భూకంపాలు సంభవించడంతో సునామీ ఆందోళనలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News