సిగరెట్లు మానేస్తే 6 రోజులు అదనపు లీవులు: జపాన్ కంపెనీ సంచలన నిర్ణయం!

`పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును` అన్నాడు గుర‌జాడ `కన్యాశుల్కం` నాటకంలో గిరీశం మాస్టారు.

Update: 2026-06-06 23:30 GMT

`పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును` అన్నాడు గుర‌జాడ `కన్యాశుల్కం` నాటకంలో గిరీశం మాస్టారు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో అంతా రివర్స్‌లో జరుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పొగ‌రాయుళ్లు పెరుగుతున్నారే కానీ త‌ర‌గ‌డం లేదనేది తాజా స‌ర్వే. అయితే పొగ తాగకుండా ఉంటే చాలు.. తమ ఉద్యోగులకు డబ్బులతో కొనలేని ఒక అద్భుతమైన బహుమతిని ఇస్తామంటూ జపాన్‌కు చెందిన ఒక కార్పొరేట్ సంస్థ ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవ‌ర్ టైమింగ్స్, తీవ్రమైన పని ఒత్తిడికి మారుపేరైన జపాన్ దేశంలోని టోక్యో నగరానికి చెందిన `పియాలా ఐ.ఎన్.సి` అనే మార్కెటింగ్ కంపెనీ.. సిగరెట్ తాగని తమ ఉద్యోగులకు ఏటా 6 రోజులు అదనపు పెయిడ్ లీవులు ఇస్తామని ప్రకటించి సరికొత్త సంచలనానికి తెరలేపింది.

ఈ వినూత్న పాలసీ వెనుక ఒక బలమైన న్యాయబద్ధమైన కారణం ఉంది. కార్యాలయాల్లో పొగ తాగే అలవాటు ఉన్న ఉద్యోగులు రోజుకు పలుమార్లు 10 నుండి 15 నిమిషాల పాటు `స్మోకింగ్ బ్రేక్స్` తీసుకుంటారు. ఇలా రోజు మొత్తం మీద వారు తీసుకునే విరామాలు నెలకు లెక్కగడితే ఎన్నో గంటల పని సమయం వృధా అవుతోంది. కానీ ధూమపానం చేయని ఉద్యోగులు మాత్రం రోజంతా తమ సీట్లలోనే కూర్చుని నిరంతరాయంగా పని చేస్తుంటారు. ఈ విధంగా ఇరు వర్గాల మధ్య ఏర్పడుతున్న పని సమయ వ్యత్యాసాన్ని గమనించిన ఒక నాన్-స్మోకర్ ఉద్యోగి.. ఇది తమకు అన్యాయం చేయడమేనంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫీడ్‌బ్యాక్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించిన కంపెనీ లీడర్‌షిప్.. ఆఫీస్‌లో సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడటం కోసం నాన్-స్మోకర్లకు ఈ 6 రోజుల అదనపు సెలవుల ప్రయోజనాన్ని ప్రవేశపెట్టింది.

సాధారణంగా ఉద్యోగులపై ఆంక్షలు విధించడం.. జరిమానాలు వేయడం లేదా బలవంతంగా అలవాట్లు మాన్పించడం వంటి కఠిన నిబంధనలకు భిన్నంగా ఈ సంస్థ ప్రశంసనీయమైన వ్యూహాన్ని అనుసరించింది. ఇక్కడ పొగ తాగే వారిపై ఎలాంటి పెనాల్టీలు విధించలేదు. వారికి ఇప్పటికీ స్మోకింగ్ బ్రేక్స్ తీసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ పొగ తాగని వారికి లభించే 6 రోజుల అదనపు సెలవులను ఒక బలమైన ప్రోత్సాహకంగా హెల్త్ ఇన్సెంటివ్ చూపించడం ద్వారా.. సిగరెట్లు మానేసేలా ఉద్యోగుల్లో సానుకూల మార్పును ప్రేరేపించింది. ఈ పాలసీ తెచ్చిన కొద్ది నెలల్లోనే సంస్థలో మంచి ఫలితాలు కనిపించాయి. ఆఫీస్‌లో తమకు దక్కుతున్న గుర్తింపునకు నాన్-స్మోకర్లు ఆనందం వ్యక్తం చేయగా... ఆ 6 రోజుల అదనపు సెలవుల బోనస్ కోసం కంపెనీలో కొందరు సిగరెట్ తాగడం పూర్తిగా మానేయడం విశేషం.

జపాన్ కార్పొరేట్ సంస్కృతిలో గతంలో సమావేశాల్లోనే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సిగరెట్లు తాగడం... బ్రేక్స్ సమయంలో బాస్‌లతో కలిసి ఉద్యోగులు పొగ తాగుతూ బాండింగ్ పెంచుకోవడం సర్వసాధారణంగా ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు జపాన్‌లో పబ్లిక్ స్మోకింగ్ బ్యాన్ లు పెరగడం.. సిగరెట్ టాక్సులు ఎక్కువ కావడం వల్ల గత 20 ఏళ్లలో ధూమపానం చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినా కానీ కంపెనీలు తమ అంతర్గత పాలసీల్లో ఇలాంటి మార్పులు చేయడానికి వెనుకాడుతున్న తరుణంలో `పియాలా ఐ.ఎన్.సి` తీసుకున్న నిర్ణయం ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కేవలం ఆరోగ్యం జాగ్ర‌త్త‌! అనే బోర్డులను చూసి మారలేని మనుషులు 6 రోజుల అదనపు లీవుల ఆఫర్‌ను మాత్రం వదులుకోలేకపోతున్నారు. ఈ ప్రగతిశీల ఆలోచనను చూసి జపాన్‌లోని ఇతర కంపెనీలు కూడా ఇప్పుడు తమ సంస్థల్లో ఇలాంటి నిబంధనలను తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ఆరోగ్యంతో పాటు ఉత్పాదకత వ్యాపార విజయం.. ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందించడానికి ఇదొక తెలివైన వ్యూహమని గ్లోబల్ స్టడీస్ చెబుతున్నాయి. పొగ తాగని ఉద్యోగులు తక్కువగా అనారోగ్యానికి గురవుతారని... తద్వారా కంపెనీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా తగ్గుతున్నాయ‌ట‌. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల కుటుంబాలలో కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిపై చర్చలు మొదలయ్యాయి. బ‌ల‌వంతంగా కాదు.. ప్ర‌యోజ‌నం చేకూర్చ‌డం ద్వారా మార్పు కోర‌డం ఎంత తెలివైన నిర్ణ‌య‌మో అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది.

Tags:    

Similar News