జనసేన ముఖ్య నేతకు టీడీపీ పోటు.. ఆయన రూటు అటేనా?

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ–జనసేన కూటమి తపిస్తోంది

Update: 2024-01-17 15:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ–జనసేన కూటమి తపిస్తోంది. అయితే పొత్తు వల్ల కొన్ని సీట్లలో కీలక నేతలకు వారి స్థానాల్లో సీట్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటివాటిలో గుంటూరు జిల్లా తెనాలి ఒకటని చెబుతున్నారు,

ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన అన్నాబత్తుని శివకుమార్‌ ఉన్నారు. ఏఎస్‌ఎన్‌ విద్యా సంస్థల అధినేతగా ఉన్న శివకుమార్‌ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఇక టీడీపీ తరఫున ఇక్కడ 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (రాజా) గెలుపొందారు. ఈయన కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.

ఆలపాటి రాజా 1994, 1999ల్లో వేమూరు నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వంలో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలో 2004లో వేమూరులో ఆలపాటి ఓడిపోయారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేమూరు ఎస్సీ రిజర్వుడ్‌ గా మారడంతో ఆలపాటి రాజా తెనాలి నుంచి పోటీ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, ప్రస్తుతం జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ చేతిలో ఆలపాటి రాజా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.

Read more!

కాగా 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజా టీడీపీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ను ఓడించారు. ఇక 2019లో అన్నాబత్తుని శివకుమార్‌ వైసీపీ తరఫున మరోసారి పోటీ చేసి రాజాపై గెలుపొందారు.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో తెనాలి సీటును జనసేనకు వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తర్వాత స్థానంలో నెంబర్‌ టూగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెండు పర్యాయాలు 2004, 2009ల్లో నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ గా కూడా పనిచేశారు,

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెనాలి సీటును జనసేన పార్టీకి వదిలేయాల్సి ఉంటుంది. కాగా తెనాలి నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు, కాపు ఓటర్లు సమానంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఈ పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కు సీటు హుళక్కే అయినట్టే. ఈ నేపథ్యంలోనే తాజాగా తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజా వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సీటును జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

4

ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్‌ కు సీటు ఇవ్వడం ఖాయం కాబట్టి ఆలపాటి రాజాకు ఎమ్మెల్సీగా అవకాశమివ్వవచ్చని చెబుతున్నారు. లేదా గుంటూరు నుంచి ఎంపీ పదవికి పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా టీడీపీకి చెందిన గల్లా జయదేవ్‌ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీగా ఆలపాటి రాజాను బరిలోకి దింపొచ్చని అంటున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆలపాటి రాజాకు హామీ ఇచ్చారని టాక్‌ నడుస్తోంది. తెనాలి నియోజకవర్గం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. అలాగే అమరావతి రాజధాని ప్రాంతం సైతం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆలపాటి రాజా అయితే గట్టి అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. మరి దీనికి ఆలపాటి అంగీకరిస్తారా అనేదే వేయి మిలియన్‌ డాలర్ల ప్రశ్న!

Tags:    

Similar News