మేయర్ సీటు మీద జనసేన కన్ను ?
ఉత్తరాంధ్రాలో జనసేన బలపడడానికి చూస్తోంది. దాంతో ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఎక్కువగా ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇస్తోంది.
ఉత్తరాంధ్రాలో జనసేన బలపడడానికి చూస్తోంది. దాంతో ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఎక్కువగా ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇస్తోంది. ఉత్తరాంధ్రాలో తూర్పు కాపులు ఎక్కువగా ఉండడం సామాజిక వర్గం పరంగా తమకు కలసి వచ్చే అంశమని జనసేన గట్టిగా నమ్ముతోంది. ఇక ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో ఆరు సీట్లు ఇపుడు పొత్తులో భాగంగా జనసేన పరం అయ్యాయి. అంటే అర డజన్ ఎమ్మెల్యేలు జనసేన నుంచి ఉన్నారు అన్న మాట. అందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి నలుగురు ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఒకరు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకరు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణలో ఉత్తరాంధ్రా నుంచే ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని జనసేన చూస్తోంది. ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు తీసుకోవడంతో పాటు ఒక మేయర్ సీటుని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.
రెండు మేయర్ పీఠాలు :
ఉత్తరాంధ్రా విషయానికి వస్తే మూడు కార్పోరేషన్లు ఉన్నాయి. విశాఖ విజయనగరం శ్రీకాకుళం కార్పోరేషన్లలో శ్రీకాకుళం కి న్యాయ పరమైన చిక్కుల కారణంగా గత పుష్కర కాలంగా స్థానిక ఎన్నికలు జరగడం లేదు. దాంతో విజయనగరం విశాఖ మేయర్ పీఠాలు మాత్రమే మిగిలాయి. ఈ రెండింట్లో విశాఖ మేయర్ పీఠం టీడీపీ తీసుకుంటుంది అని అంటున్నారు. నాలుగేళ్ళ వైసీపీ పాలన తరువాత అవిశ్వాసం పెట్టి దించేది చివరి ఏడాది మేయర్ గా టీడీపీకి చెందిన శ్రీనివాసరావు పనిచేశారు. ఈసారి అయిదేళ్ళ పూర్తి కాలం పనిచేయాలని టీడీపీ చూస్తోంది. దాంతో విజయనగరం మీద జనసేన కన్ను పడింది అని అంటున్నారు.
తొలి చాన్స్ వైసీపీది :
విజయనగరం కార్పోరేషన్ గా 2021లో ఏర్పాటు అయింది. మొదటి ఎన్నికల్లో మేయర్ పీఠం వైసీపీకి దక్కింది. ఈసారి కూటమి పార్టీల నుంచి వైసీపీ గట్టి పోరుని ఎదుర్కోనుంది. అదే సమయంలో మొత్తానికి మొత్తం అన్ని సీట్లూ గెలుచుకోవాలని కూటమి పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మేయర్ పీఠం మీద జనసేన నేతలు ఆశలు పెంచుకున్నారని అంటున్నారు. తమకు మేయర్ పీఠం అప్పగించాలని పొత్తులో భాగంగా కోరుతామని జనసేన నేతలు అంటున్నారు. జనసేనకు విజయనగరం పట్టణ పరిధిలో పట్టుంది. అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ తరఫున ఉన్నారు.
ప్రత్యక్ష ఎన్నికలుగా :
మేయర్ పీఠానికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అందువల్ల ముందుగా పొత్తులో ఈ మేయర్ గా తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తే గెలుపు ఖాయమని జనసేన భావిస్తోంది. అయితే విజయనగరంలో టీడీపీ పాతుకుపోయిన పార్టీగా ఉంది. అన్ని వార్డులలో బూత్ లెవెల్ దాకా టీడీపీ ఉంది. సంస్థాగతంగా ఇంత బలమైన తమకు మేయర్ పీఠం దక్కకపోతే ఎలా అని తమ్ముళ్ళు అంటున్నారు. అంతే కాదు తొలిసారి వైసీపీ మేయర్ పీఠం ఎక్కింది. ఈసారి చాన్స్ టీడీపీదే అని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే పొత్తులు అంటేనే సర్దుబాటు అని ఉత్తరాంధ్రాలో తమకు ఒక మేయర్ పోస్టు ఇచ్చి తీరాల్సిందే అన్నది జనసేన నేతల మాటగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.