విశాఖకు మెట్రో వైభవం...కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ ఏపీలో అతి పెద్ద నగరం. ఇపుడు ఆ నగరం మెడలో మణి హారంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రాబోతోంది.

Update: 2026-09-28 12:38 GMT

విశాఖ ఏపీలో అతి పెద్ద నగరం. ఇపుడు ఆ నగరం మెడలో మణి హారంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రాబోతోంది. దశాబ్దాల విశాఖ వాసుల కలలు నిజం అవుతున్నాయి. విశాఖ నానాటికీ ఎదుగుతున్న నగరం. ఈ రోజున పాతిక లక్షల దాకా జనాభా ఉంది. రేపటి రోజున అది రెట్టింపు కానుంది. ఇప్పటికే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్న నగరానికి భారీ ఉపశమనంగా మెట్రో రైలు ప్రాజెక్ట్ రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ మెట్రో రైలు కూత పెట్టేందుకు పచ్చ జెండా ఊపేసింది. దీంతో అతి పెద్ద ముందడుగు పడింది అని అంటున్నారు.

మూడు కారిడార్లుగా :

ఇదిలా ఉంటే విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అతి ముఖ్యమైన ఘట్టం పూర్తి అయింది అని భావిస్తున్నారు. మూడు కారిడార్లుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం అంచనా వ్యయంగా సుమారు రూ. 11 వేల 488 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఖర్చు చేయనున్నారు. ఇక మొత్తం దూరం చూస్తే 46.22 కిలోమీటర్లు ఉండబోతోంది. అలాగే మొత్తం 43 మెట్రో స్టేషన్లు ఉండబోతున్నాయి. ఇక మెట్రో కారిడార్లు మూడు ఉంటాయని చెబుతున్నారు.

నగరాన్ని కలుపుతూ :

విశాఖ మహా నగరాన్ని కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. అలా మూడు కారిడార్లతో నిర్మాణం జరగబోతోంది. ఇందులో మొదటి లైన్ చూస్తే కూర్మన్నపాలెం నుండి కొమ్మాది జంక్షన్‌ వరకు ఉండబోతోంది. దాని దూరం 34.4 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక స్టేషన్లు 29 గా ఉంటాయి.రెండవ లైన్ గురుద్వారా నుండి పాత పోస్టాఫీసు వరకు ఉంటుంది. దాని దూరం 5.07 కిలో మీటర్లు, ఈ కారిడార్ లో స్టేషన్లు ఆరు దాకా ఉంటాయి. మూడవ లైన్ తాడిచెట్లపాలెం నుండి చినవాల్తేరు వరకు ఉంటుంది. దాని దూరం 6.75 కిలో మీటర్లు గా ఉంది. స్టేషన్లు ఏడు ఇక్కడ వస్తాయి.

భోగాపురం దాకా :

ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన ఈ మెట్రో రైలు ప్రాజెక్టు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఆధారంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ డీపీఆర్ లో కొమ్మాది దాకానే ఉండబోతోంది. భవిష్యత్తులో దీనిని మరింతాగ పొడిగించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాకా మెట్రో రైలు నడిచే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ కనుక పట్టాలు ఎక్కితే లక్షలాది మంది ప్రజలకు ప్రయాణం సుఖవంతంగా వేగవంతంగా అతి తక్కువ ఖర్చుతో సాగుతుంది. అంతే కాదు ఏ మూల నున్న వారు అయినా నగరంతో నేరుగా అనుసంధానం అవుతారు. తమ ఉపాధి అవకాశాలను మరింతంగా పెంచుకుంటారు. నగర ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News