'పర్సనల్' ఇమేజ్ పెంచుకుంటేనే రాధా రాజకీయం సక్సెస్.. !
విజయవాడకు చెందిన వంగవీటి రాధా.. తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు .
విజయవాడకు చెందిన వంగవీటి రాధా.. తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు . దీంతో ఆయన రాజకీయాలపై మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ, వాస్తవానికి ఆయన ఏపార్టీలో ఉన్నా రన్న దానికంటే కూడా.. వ్యక్తిగతంగా ఎంత మేరకు ఇమేజ్ పెంచుకుంటున్నారన్నది ప్రశ్న. ఏ పార్టీకైనా,, నాయకు డికైనా వ్యక్తిగత ఇమేజ్ సొంతం చేసుకునే చొరవలేక పోతే.. ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో రాధా ప్రస్థానమే పెద్ద ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.
రాజకీయాల్లో సుదీర్ఘ కాలం రాణించాలన్నా, సొంతంగా బలమైన పునాది ఏర్పరచుకోవాలన్నా కేవలం ‘తండ్రి పేరు’ లేదా ‘వారసత్వం’ మాత్రమే సరిపోదు, స్వయంకృషితో ‘పర్సనల్ ఇమేజ్’ పెంచుకోవడం ఎంతో ముఖ్యం అనేది వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే అర్ధమవుతుంది. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధాకృష్ణ ఇప్పటి వరకు వెనుకబాటులోనే ఉన్నారు. కేవలం వారసత్వమే శ్రీరామరక్ష కాదన్న విషయాన్ని ఆయన గ్రహించలేక పోతున్నారని అంటున్నారు.
వంగవీటి రంగాకు ఉన్న ప్రజాదరణ, ఆయన సామాజిక వర్గంలో ఉన్న క్రేజ్ రాధాకు పెద్ద ప్లస్ పాయింట్ అనడంలో సందేహం లేదు. కానీ, కేవలం తండ్రి పేరుతోనే ప్రతి ఎన్నికల్లోనూ గెలవడం సాధ్యం కాదు. ప్రజల్లో ఒక స్వతంత్ర నాయకుడిగా ఎదగాలంటే ఆయనకంటూ ప్రత్యేకమైన పనితీరును, వ్యక్తిగత ముద్రను (పర్సనల్ బ్రాండ్‌ను) చాటుకోవాలి. కానీ, రాధా నిలకడ లేని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఆయన కేడర్‌లో అయోమయం నెలకొంది. రాధా గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత టీడీపీ.. ఇలా పలు పార్టీలు మారడం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌పై కొంత ప్రభావం చూపింది.
పార్టీ మారిన ప్రతిసారీ తన వెన్నంటి ఉండే అభిమానులకు భరోసా ఇవ్వడంలో ఆయన కొంత వెనుకబడ్డారనే విమర్శ ఉంది. ఒకే పార్టీలో ఉంటూ లేదా ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకుని పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటేనే కేడర్ బలంగా నిలబడుతుంది. ఇటీవలి కాలంలో రాధాకృష్ణ పెద్దగా ప్రజల్లోకి రాకుండా, కేవలం కీలక సమయాల్లో లేదా ఎన్నికల ముందే కనిపిస్తున్నారనే అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటే నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడటం, మీడియాలో, క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా ఉండటం ఎంతో అవసరం.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.ఇలాంటి కీలక తరుణంలో రాధా కేవలం తెరవెనుక సమీకరణాలకే పరిమితం కాకుండా, ప్రజల్లో తనకంటూ ఒక బలమైన పొలిటికల్ ఇమేజ్ నిర్మించుకుంటేనే విజయవాడ రాజకీయాల్లో లేదా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మళ్లీ కీలకమైన లీడర్‌గా ఎదగగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.