‘సేనతో సేనాని’ ఈ పేరు ఇక పక్కా అనుకోవచ్చా..?
కూటమి ప్రభుత్వంలోని కీలక భాగస్వామి జనసేన అధికారంలోకి వచ్చిన తొలిసారి భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది.;
కూటమి ప్రభుత్వంలోని కీలక భాగస్వామి జనసేన అధికారంలోకి వచ్చిన తొలిసారి భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన జనసేన.. సుమారు 14 నెలల పాలన తర్వాత ప్రజలు, కార్యకర్తలు మనోగతాన్ని తెలుసుకునేందుకు మూడు రోజులపాటు పార్టీ సమావేశాల నిర్వహణకు సమాయుత్తమైంది. గురువారం నుంచి శనివారం సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమం జనసేన భవిష్యత్తు ప్రయాణంపై దిశానిర్దేశం చేస్తుందని అంటున్నారు. ఈ మూడు రోజుల పాటు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతోనే గడుపుతారని జనసేన ప్రకటించింది.
‘సేనతో సేనాని’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశాఖ వేదిక అయింది. పార్టీకి గట్టి పట్టున్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు కేంద్రమైన విశాఖలో ఈ భారీ కార్యక్రమం నిర్వహించడమే ఒక వ్యూహాత్మక విజయంగా చెబుతున్నారు. విశాఖ నగరంలో జనసేనాని పవన్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉండటం, ఉత్తరాంధ్రలో జనసేనకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటంతో సభ సక్సెస్ అయ్యేందుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదంటున్నారు. తొలిరోజు ప్రారంభ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువగా చర్చిస్తారని చెబుతున్నారు. ఇక 29వ తేదీన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉన్న కార్యకర్తలను ఎంపిక చేసి నియోజకవర్గాల వారీగా వారితో అధినేత పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పది మంది కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
30న బహిరంగ సభ
విశాఖ బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాలు, మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 30న ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. దీంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమం జనసేనకు కొత్త ఊపు తీసుకువస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతో తొలిసారి అధినేత ముచ్చటించనుండటం ఆసక్తికరంగా మారింది.
విభేదాలపై చర్చ
ఇన్నాళ్లు అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన జనసేనాని ఎట్టకేలకు పార్టీకి సమయం కేటాయించడంతో ఈ ఏడాదిలో చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏడాదిగా పార్టీ కార్యకర్తలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూటమిలోని ప్రధాన భాగస్వామి టీడీపీతో హైకమాండ్ స్థాయిలో సత్సంబంధాలు నెలకొన్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కార్యకర్తల మధ్య సమన్వయానికి కూటమి పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీంతో ఈ సమస్యలకు ‘సేనతో సేనాని’ పరిష్కారం చూపుతుందా? లేదా? అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
పేరు బాగుంది
మరోవైపు పార్టీ కార్యక్రమానికి ‘సేనతో సేనాని’ పేరు నిర్ణయించడం ఆకర్షిస్తోందని అంటున్నారు. టీడీపీ తన ద్వైవార్షిక సమావేశాలకు మహానాడు అన్న పేరుతో ప్రతి రెండేళ్లకు ఒకసారి భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా మహానాడును క్రమం తప్పకుండా కొనసాగిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని మరో ప్రధాన రాజకీయ పార్టీ వైసీపీ కూడా పార్టీ కార్యకర్తలతో ‘ప్లీనరీ’ నిర్వహిస్తుంది. దీనికి కచ్చితమైన సమయం అంటూ నిర్ణయించుకోక పోయినా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఎక్కువసార్లు వైసీపీ ప్లీనరీ నిర్వహించేవారు. ఇక జనసేన మాత్రం ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్లు అవుతున్నా, ఏడాదికి ఒక సారి వార్షికోత్సవ సభ నిర్వహణకే జనసేన పరిమితమైంది. కానీ, టీడీపీ మహానాడు, వైసీపీ ప్లీనరీలా ఒక పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించలేదని అంటున్నారు. ఇప్పుడు పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ‘సేనతో సేనాని’ పేరుతో మూడు రోజుల కార్యకర్తల మధనం నిర్వహించడంతో భవిష్యత్తులోనూ ఇదే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుదన్న సూచనలు వినిపిస్తున్నాయి.