రాయలసీమపై జనసేన ఫోకస్.. ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా?

అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో 21 చోట్ల విజయం సాధించిన జనసేన.. విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది.;

Update: 2025-02-04 18:30 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో 21 చోట్ల విజయం సాధించిన జనసేన.. విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. అధికారం చేతికి చిక్కిన నుంచి ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ రాష్ట్రంలో మరిన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడరును తయారుచేసుకుంటున్న జనసేన.. తాజాగా రాయలసీమపై ప్రత్యేక వ్యూహం రెడీ చేసింది. జనసేన అంటే ఒక కులం, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని సంకేతాలివ్వడంతోపాటు ప్రతిపక్ష వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ స్థానంలో ఎదగాలని ప్రణాళిక రెడీ చేస్తోందని అంటున్నారు.

రాయలసీమలోని పుంగనూరు నియోజకవర్గంలో జనసేన బహిరంగ సభ నిర్వహించడం అనేక రాజకీయ సందేహాలకు తావిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, జనసేనాని పవన్ సోదరుడు నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ప్రత్యేకత ఏంటంటూ రాజకీయ పరిశీలకులకు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సభలు పెట్టాల్సిన అవసరం లేకపోయినా, అధికార పార్టీ ఇలా ప్రత్యేక సమావేశం నిర్వహించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అనుమానిస్తున్నారు.

2014లో ఆవిర్భవించిన జనసేన పదేళ్ల తర్వాత అతిపెద్ద విజయం సాధించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లో పోటీ చేయపోయినా, 2019లో సొంతంగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నది. 175 స్థానాలకు పోటీ చేసి కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఇక ఆ ఎన్నికల తర్వాత జనసేనాని పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేశారు. టీడీపీతో జట్టుకట్టి తిరుగులేని విజయం సాధించారు. ఒక విధంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ గేమ్ ఛేంజర్ అయ్యారంటారు.

ఇలా రాష్ట్రంలో బలమైన స్థానంలో ఉన్న జనసేన.. ఉన్నట్టుండి రాయలసీమలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం చర్చకు తావిస్తోంది. వైసీపీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఇప్పటివరకు ఆయన హవాయే కొనసాగుతోంది. పెద్దిరెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా మాత్రమే పుంగునూరులో ఎగురుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడంతోపాటు అలాంటి గట్టి ప్రత్యర్థిని మట్టికరిపించేలా పార్టీని బలోపేతం చేయాలని జనసేనాని పవన్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా రాయలసీమలో జనసేనకు కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య పెరగాలంటే ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

గత ఎన్నికల వరకు జనసేన అంటే కాపు సామాజికవర్గానికి మాత్రమే పరిమితమైన పార్టీగా చిత్రీకరించారని, గోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేన ప్రభావం ఉంటుందని చెప్పేవారని కానీ, ఇప్పుడు ఆ ముద్ర తొలగిపోయింది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లో జనసేన గత ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, ఆ పక్కనే ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోటీకి జనసేనకు అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమపై ఫోకస్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మరింత బలమైన శక్తిగా ఎదగాలని జనసేన కోరుకుంటోందని అంటున్నారు. ఇదే సమయంలో రాయలసీమలో బలిజ సామాజికవర్గంతోపాటు బీసీలు ఎక్కువగా ఉండటం తమకు అనుకూలంగా జనసేన విశ్లేషిస్తోంది.

వాస్తవానికి రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి పెద్దగా బలం లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో చంద్రబాబు సునామీ వల్ల తొలిసారి అత్యధిక స్థానాలు దక్కించుకుంది టీడీపీ. ఈ ప్రాంతంలో తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ హవా నడిచింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. ఈ బలం పది కాలాల పాటు వర్ధిల్లాలంటే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతో పుంగనూరు సభకు రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. ఇకపై కూడా రాయలసీమలో ముఖ్య ప్రాంతాల్లో జనసేన కార్యక్రమాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు.

Tags:    

Similar News