'ఇది కథకాదు!'.. పవన్ రంగంలోకి దిగాల్సిందే!
విషయం చిన్నదా పెద్దదా.. అనే దాంతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే చిన్నది కావొచ్చు.;
విషయం చిన్నదా పెద్దదా.. అనే దాంతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే చిన్నది కావొచ్చు. కానీ, అధికారికంగా, రాజకీయంగా చూస్తే మాత్రం తాజాగా వెలుగుచూసిన ఘటన చాలా చాలా పెద్దది. మరో మాటలో చెప్పాలంటే.. `అరాచకం`. మరి ఈ విషయం నిజమైతే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే జోక్యంచేసుకుని.. రంగంలోకి దిగి సమస్యను సరిదిద్దాలి. ఎందుకంటే.. ఆరోపణలు వచ్చింది.. ఆయన పార్టీ కీలక నేతలపైనే కావడం.. అందునా.. ఓ అనాథ యువతి తన చెవి కమ్మలను లంచంగా ఇచ్చేందుకు సిద్ధపడడం. ఇదేమీ చాటు మాటు వ్యవహారం కాదు.. సాక్షాత్తూ కలెక్టర్ ముందే జరిగిన పని. మరి ఆ యువతికి ఏం జరిగింది? దీనిలో జనసేన నాయకుల ప్రమేయం ఏంటి? లంచాల వ్యవహారం ఏంటి? అనేది ఆసక్తిగా మారాయి.
ఎవరీ యువతి?
ఉమ్మడి కృష్నాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి(24) అనాథ. ఆమె అవివాహిత. తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో మర ణించారు. అయితే.. ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో ఇరుక్కున్న ఆమె..కోర్టును ఆశ్రయించి విజయం దక్కించుకుం ది. ఇంటి స్థలాన్ని సొంతం చేసుకుంది. కానీ, అవతలి పక్షానికి కొమ్ముకాస్తున్న మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు.. యువతిని వేధిస్తున్నారు. అంతేకాదు.. ఇంటి స్థలంలోకి అడుగు కూడా పెట్టకుండా భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులకు చెప్పుకొన్నా.. వారు సైతం కనికరించకపోగా.. సర్దుకు పోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
దీంతో ఆమె రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది. రెవెన్యూ పంచాయతీ అధికారులు కూడా జనసేన నాయకులతో మిలాఖత్ అయ్యారు. రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితిలో ఆమె.. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం `మీకోసం` గ్రీవెన్స్‌కు వచ్చి.. ఆర్డీవో, కలెక్టర్ ముందే తన గోడు వెళ్లబోసుకుంది. ``నా పని చేసి పెట్టండి. మీరడిగిన లంచం సొమ్ము ఇవ్వలేను. ఇవి తీసుకుని నాకు పనిచేయండి`` అంటూ చెవి కమ్మలు తీసి టేబుల్ పై ఉంచి అధికారులను వేడుకుంది. తన సమస్యను వివరిస్తూ కన్నీటి పర్యంతం అయింది.
ముఖ్యంగా జనసేన నాయకుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కూడా ఆ యువతి రోదించడం చూపరులను కన్నీటి పర్యంతం చేసింది. మరి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇలాంటి విషయాలపై పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు చేస్తున్న పనుల కారణంగా పార్టీకి.. అధినేతకు కూడా చెడ్డపేరు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని స్థానికులు కూడా పవన్‌కు విన్నవిస్తున్నారు. ఇదిలావుంటే.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.