పవన్ జిల్లాల పర్యటన ... ముహూర్తం పెట్టేశారా... !
వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని గత ఏడాది నిర్వహించిన పార్టీ ప్లీనరీలోనే పవన్ ప్రకటించారు. అటు పార్టీ పరంగా.. ఇటు ప్రజల పరంగా కూడా కార్యక్రమాలు పర్యవేక్షిస్తానని చెప్పారు.;
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జిల్లాల పర్యటన మరోసారి వాయిదా పడింది. దీనిపై పార్టీ కార్యాలయ వర్గాలు అత్యంత విశ్వసనీయంగా చెబుతున్న సమాచారం మేరకు.. ఏప్రిల్ చివరి వరకు పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన ఉండదని సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని గత ఏడాది నిర్వహించిన పార్టీ ప్లీనరీలోనే పవన్ ప్రకటించారు. అటు పార్టీ పరంగా.. ఇటు ప్రజల పరంగా కూడా కార్యక్రమాలు పర్యవేక్షిస్తానని చెప్పారు.
కానీ, ఈ పర్యటన వాయిదా పడింది. తాజా సమాచారం మేరకు.. ఏప్రిల్ చివరి వారంలో పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం జిల్లాల్లోనే కాకుండా.. గ్రామాల్లోనూ పవన్ పర్యటించనున్నారు. అయితే..ఈ వాయిదా వెనుక అభివృద్ధి కార్యక్రమాలే కారణంగా ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో మౌలిక సదుపా యాల పనులు జరుగుతున్నాయి.
ముఖ్యంగా రహదారుల నిర్మాణం జోరుగా సాగుతోంది. వీటిని పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు న్నారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పనులకు.. తన పర్యటనతో విఘాతం కలుగుతుం దని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు. అందుకే.. వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు.. ఏప్రిల్ మొదటి వారంలో ఎలాగూ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ నేపథ్యంలో అప్పుడు ఒకేసారి పర్యటనలు చేస్తే బెటర్ అన్న ఆలోచన ఉంది.
మరోవైపు.. పార్టీలో ప్రస్తుతం సభ్యత్వ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నాయకులు నెమ్మదిగా కదులుతున్నారు. వచ్చే నెల నాటికి సభ్యత్వ కార్యక్రమం మరింత జోరుగా జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలో మార్చిలో పర్యటన పెట్టుకుంటే.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్న పవన్ కల్యాణ్.. ఏప్రిల్ చివరి వారం అయితే.. అందరికీ బాగుంటుందని భావిస్తున్నట్టు జనసేన కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.