"వెలుగుతున్న టార్చ్".. ఆ పార్టీకి గుర్తొచ్చొందోచ్

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం కేటాయించింది.

Update: 2024-03-14 11:09 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన పార్టీకి కామన్ సింబల్ ను ఎన్నికల సంఘం కేటాయించింది. రాజకీయంగా కంటే అధికారిగానే బాగా పాపులర్ అయిన ఆయన అనూహ్యంగా ప్రారంభించిన పార్టీకి ఎన్నికల ముంగిట శుభవార్త అందింది. దాదాపు ఆరేళ్లుగా తన ఆదర్శాలను ప్రజల్లోకి చేరవేస్తూ.. ఆరు నెలల కిందట పార్టీ కూడా స్థాపించిన ఆయన భావాలకు తగ్గట్టే.. చీకట్లో దారిచూపే వస్తువు గుర్తు లభించింది.

ఏపీ ఎన్నికల ముంగిట

మరొక్క నెలలో జరగనున్న ఏపీ ఎన్నికల ముంగిట సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం కేటాయించింది. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ.. సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా ఉన్నప్పుడు.. జగన్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ అందరికీ దగ్గరయ్యారు. ఓ దశలో జగన్ యాంటీ మీడియాకు లీకులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక 2018లోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి జన సేన తరఫున ఎంపీగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఆ పార్టీకి దూరం జరిగారు. కొన్నాళ్ల కిందట జైభారత్‌ నేషనల్‌ పార్టీని ప్రారంభించారు.

సాధారణ ఎన్నికల గుర్తుగా టార్చి..

మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ వచ్చింది. జై భారత్‌ నేషనల్‌ పార్టీకి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్‌ సింబల్‌ గా దీనిని వాడుకోవచ్చు. దీంతో ఈసీకి లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు.

కొసమెరుపు: ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు తన ఆదర్శ భావాలను యువత, విద్యార్థులకు చేరవేసేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించారు. విశాల భావాలను వ్యాపింపజేసేందుకు పాటుపడ్డారు. నిరాశలో ఉన్నవారికి దారి చూపే దీపంగా కనిపించేవారు. అలాంటి వ్యక్తి పార్టీకి చీకటిలో దారి చూపే టార్చి లైట్ గుర్తు రావడం చెప్పుకోదగ్గదే.

Tags:    

Similar News