41 రోజుల రాజశ్యామల యాగం...సీఎం గా జగనేనా ?

రాజశ్యామల యాగానికి ఎంతో పవిత్రత విలువ ఉన్నాయి. ఈ యాగం చేసిన వారు ఎవరూ అధికారాన్ని కోల్పోలేదు

Update: 2024-05-16 02:30 GMT

రాజశ్యామల యాగానికి ఎంతో పవిత్రత విలువ ఉన్నాయి. ఈ యాగం చేసిన వారు ఎవరూ అధికారాన్ని కోల్పోలేదు. అంతే కాదు పది కాలాల పాటు ఉన్నారు. పురాణాలలో దేవుళ్ళు కూడా ఈ యాగాన్ని చేపట్టి రాజ్యాన్ని అందుకున్నారు. ఇక ఆధునిక కాలంలో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ శ్యామల యాగం చాలా ప్రాచుర్యం పొందింది. కేసీఆర్ ఈ యాగం చేసి రెండు సార్లు తెలంగాణాకు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ పేరిట 2019లో ఈ యాగాన్ని విశాఖలోని శ్రీ శారదాపీఠం జరిపించింది దాని ఫలితంగా జగన్ సీఎం కాగలిగారు అని కూడా ప్రచారంలో ఉంది.

జగన్ సీఎం అయ్యాక ఏడాది క్రితం విజయవాడలో అష్టలక్ష్మీ యాగంతో పాటు రాజశ్యామల యాగాన్ని దేవాదాయ శాఖ ఘనంగా కొన్ని రోజుల పాటు నిర్వహించింది. ఆ యాగాన్ని జగన్ ప్రారంభించారు. చివరి రోజు పూర్ణాహుతిలోనూ పాల్గొన్నారు.

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా ప్రతీ ఏటా కొన్ని రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా సాగుతాయి. చివరి రోజున రాజశ్యామల యాగం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రతీ ఏడాది వచ్చి పాల్గొనడమూ అంతా చూశారు.

Read more!

ఇటీవల అంటే ఈ నెల మొదటి వారంలోనూ రాజశ్యామల యాగాన్ని ప్రత్యేకంగా శారదాపీఠంలో నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాజ్యం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ యాగం చేసినట్లుగా పీఠం నిర్వాహకులు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ మరో మారు సీఎం కావాలని కోరుతూ తాడేపల్లిలో గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు.

ఈ విషయం కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే సరిగ్గా పోలింగ్ పూర్తి అయిన రెండవ రోజున ఈ యాగం కూడా పూర్తి అయింది. ఈ యాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మరో సారి ఏపీలో జగన్ పాలన ప్రారంభం అవుతుందని దానికి యాగ బలం దోహపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే రాజ శ్యామల యాగాన్ని కేసీఅర్ తో సమానంగా ఇంకా ఎక్కువగా జగన్ చేస్తున్నారు. ఈసారి ఆయన సీఎం అవుతారా లేదా అన్నది ప్రజా బలంతో పాటు దైవ బలం మీద కూడా ఆధారపడి ఉంది అని అంటున్నారు. దాంతో ఓటేసిన ప్రజలతో పాటు రాజశ్యామల అమ్మవారిని కూడా వైసీపీ నేతలు గట్టిగా నమ్ముకుంటున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News