జగన్ ఓదార్పు... కొత్తగా ట్రై చేయండి బాస్ !

ఇక ఆనాడు జగన్ ఓదార్పు యాత్ర చేసినా మొత్తం తెర వెనక అంతా సమకూర్చి పెట్టినది ఒక బలమైన సామాజిక వర్గం. అలాగే జగన్ లో లీడర్ ని చూసుకునే ఆల్టర్నేషన్ పాలిటిక్స్ ని కోరుకునే జనాలు.;

Update: 2024-06-20 12:00 GMT

జగన్ ఓదార్పు యాత్ర మళ్లీ చేయబోతున్నారు అని ఒక విషయం అయితే బయట ప్రచారంగా వచ్చింది. పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ మేరకు ప్రకటించారని ఒక విషయం చక్కర్లు కొడుతోంది. అయితే ఇది అఫీషియల్ గా మాత్రం కాదు.

అయితే దీని మీదనే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఓదార్పు యాత్ర అన్నది ఇప్పటికి పదిహేనేళ్ల క్రితం కొత్త కాన్సెప్ట్. అప్పటి దాకా ఆ తరహా యాత్రలు ఉంటాయని కూడా ఎవరికీ తెలియదు. 2009లో సెప్టెంబర్ 3న వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారని తెలిసిన వెంటనే చాలా గుండెలు ఆగాయి. వారిని పరామర్శిస్తాను అని జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారు.

అప్పట్లో అది సూపర్ గా క్లిక్ అయింది. దానికి మరో కారణం అపుడు ఉన్న రాజకీయ వాతావరణం. వైఎస్సార్ వారసుడిగా జగన్ మీద జనాలలో ఆసక్తి. అంతే కాదు కాంగ్రెస్ హై కమాండ్ బ్రేకులు వేయడం ఇలా అనేక అంశాలు ముడిపడి ఓదార్పు యాత్రను హైలెట్ చేసి పారేసాయి. అయితే ఇపుడు మళ్లీ ఇన్నేళ్ళ తరువాత జగన్ ఓదార్పు యాత్ర అంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

అప్పటికీ ఇప్పటికీ చూస్తే జగన్ అంటే ఏమిటో పూర్తిగా జనాలకు బాగా తెలుసు. ఆయన పార్టీ అధినేతగానే కాదు ముఖ్యమంత్రిగానూ తెలుసు. అందువల్ల ఆ అట్రాక్షన్ ఆ హైప్ అన్నది ఇపుడు ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఆనాడు జగన్ ఓదార్పు యాత్ర పేరుతో కార్యకర్తల ఇళ్ళకు వెళ్తే జగన్ ని చూసేందుకు ఊరుకు ఊరే తరలివచ్చేది. అలా ప్రతీ చోటా జన సమూహాలే కనిపించేవి.

అది జగన్ నాయకుడిగా ఎదుగుతున్న క్రమాన్ని సూచించింది. అలా ఇంతింతై అన్నట్లుగా జగన్ జనంలోకి దూసుకుని రావడం వైఎస్సార్ వారసుడు అన్న అతి పెద్ద ఆకర్షణ ఇవన్నీ జగన్ ని పొలిటికల్ గా సూపర్ స్టార్ ని చేశాయి. అయితే ఇపుడు జగన్ కార్యకర్తల ఇళ్లకు వెళ్తానని అంటున్నారు. మరి జగన్ ని చూసేందుకు ఊరంతా ఇపుడు తరలి వస్తుందా అన్నది బిగ్ క్వశ్చన్. అంతే కాదు క్యాడర్ సైతం ఇపుడు పార్టీ మీద మండిపాటుగా ఉంది అని అంటున్నారు.

ఇక ఆనాడు జగన్ ఓదార్పు యాత్ర చేసినా మొత్తం తెర వెనక అంతా సమకూర్చి పెట్టినది ఒక బలమైన సామాజిక వర్గం. అలాగే జగన్ లో లీడర్ ని చూసుకునే ఆల్టర్నేషన్ పాలిటిక్స్ ని కోరుకునే జనాలు. కానీ ఇపుడు అలాంటివి ఆశించవచ్చా అన్నది మరో పాయింట్. ఇవన్నీ పక్కన పెడితే ఆనాడు వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయారు అని వేలాది మందిని జగన్ పరామర్శించారు. అయితే అందుకో ఫేక్ లిస్ట్ ఉందని అపుడే విపక్షాలు ఆరోపించాయి.

గుండె పోటు మరణాలు సహజ మరణాలు కూడా కలిపేశారు అని కూడా ఆరోపించారు. అయినా సరే ఆనాడు చాలా మంది నిజంగా కూడా చనిపోయారు. నంబర్ అయితే పెద్దది ఉండవచ్చు కానీ చనిపోయింది నిజం. అందుకే ఓదార్పు యాత్ర క్లిక్ అయింది. కానీ ఇపుడు చూస్తే వైసీపీ ఓటమి తట్టుకోలేక మరణించిన వారు ఎవరూ లేరు అని అంటున్నారు.

వైసీపీ ఓటమిని భరించలేక చనిపోయారు అని ఎక్కడా అఫీషియల్ గా న్యూస్ అయితే లేదు అంటున్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన తరువాత అనారోగ్యంతో ఎవరైనా చనిపోయినా దానిని కూడా వైసీపీ ఖాతాలో వేశారు అని అంటున్నారు. అంతే కాదు గుండె పోటుతో చనిపోయిన వారిని కూడా వైసీపీ వల్లనే ఓటమి పాలు అయ్యారని చెబుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.

ఎవరైనా అలా పార్టీ ఓటమి కోసం చనిపోయారు అంటే అది ఎక్కడ దాచినా దాగని విషయంగానే ఉంటుంది. పైగా గ్రామాలలో ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలా ప్రచారం చేశారు తప్పితే ఒరిజినల్ గా అలాంటి పరిస్థితి ఏమీ లేదనే అంటున్నారు. అయితే కొందరు మాత్రం చనిపోయారు.

అది ఎలా అంటే వైసీపీ గెలుస్తుంది అని గట్టిగా నమ్మి బెట్టింగులు కట్టిన వారే అని అంటున్నారు. దానికి కూడా వైసీపీ నాయకులే కారణం అని అంటున్నారు. పార్టీ గెలుస్తుంది, వై నాట్ 175 అని ప్రచారం చేయడం వల్లనే నమ్మి అనేక మంది బెట్టింగులలో తమ ఆస్తులు కోల్పోయి ఆ మీదట ప్రాణాలు తీసుకున్నారు అని అంటున్నారు.

అంటే ఈ పాపం ఎవరిది అని అంటున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ ఓటమి వల్ల చనిపోయారు అన్న కాన్సెప్ట్ లోనే డొల్లతనం ఉందని అంటున్నారు. ఇక దానిని ఆసరాగా చేసుకుని ఓదార్పు యాత్ర చేస్తామని చెప్పడం కూడా పక్కా ఓల్డ్ కాన్సెప్ట్ అని అంటున్నారు. ఎందువల్ల అంటే ఓదార్పు యాత్రలు పాదయాత్రలకు ఎపుడో కాలం చెల్లిపోయింది అని అంటున్నారు.

జనాలు అంతకంతకు తెలివి మీరారు అని అంటున్నారు. ఇపుడు పాత వాటిని పట్టుకుని పాకులాడితే ఉపయోగం ఉండదని అంటున్నారు. కొత్తగా ఆలోచించండి బాస్ అని సొంత పార్టీ నుంచే సలహా సూచనలు వస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఓటమి తరువాత తీసుకునే యాక్షన్ మీదనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ టైం లో గతంలో సక్సెస్ అయ్యామని పాత కాన్సెప్టులు ముందు పెట్టుకుని వస్తే ఉన్న ఆదరణ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News