సీనియర్లతో జగన్ భేటీ... తెరపైకి మరో కీలక నిర్ణయం!

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ రేపు ఈనెల 31 న మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. దీనికోసం మంగళవారం సాయంత్రం పార్టీ సీనియర్లతో భేటీ కాబోతున్నారు.

Update: 2023-10-31 01:30 GMT

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనతో పొత్తులో ఉన్న జనసేన అధినేత ఇటలీలో ఉన్నారు. మరోపక్క అధికార వైసీపీ మాత్రం చాపకింద నీరులా వారి పనులు వారు చేసుకుంటూపోతున్నారు! సరికొత్త వ్యూహాలు రచిస్తూ.. ఉన్న వ్యూహాలకు పదును పెడుతూ ముందుకుపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వైఎస్ జగన్ పార్టీ సీనియర్లతో కీలక భేటీ నిర్వహించబోతున్నారని తెలుస్తుంది!

అవును... ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు అవిరామంగా చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో ముందుకువెళ్లిన జగన్ సర్కార్... తాజాగా సామాజిక సాధికారిక బస్సు యాత్రతో ప్రజల్లో ఉంది!

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ రేపు ఈనెల 31 న మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. దీనికోసం మంగళవారం సాయంత్రం పార్టీ సీనియర్లతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఈ నిర్ణయం ప్రకటించబోతున్నారని సమాచారం. ఈ భేటీలో ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు ఇతర ఇన్ ఛార్జ్ లు కూడా ఉంటారు. ఇందులో సామాజిక సాధికారిక యాత్రలపై చర్చించడంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఇందులో భాగంగా... ప్రతీ నియోజకవర్గానికి కొత్తగా ఒక కీలక వ్యక్తిని నియమించేందుకు వైసీపీ అధినేత కసరత్తు చేస్తున్నారట. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ 175 మందిని ఇలా ప్రత్యేక ఇన్ ఛార్జ్ లుగా నియమిస్తారని చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికల వ్యవహారాల్ని చక్కబెట్టడం.. ఓటర్ లిస్ట్ పై అవవహన కలిగి ఉండటంతోపాటు.. కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ఈ వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారట.

Read more!

అయితే... ఈ కీలక వ్యక్తుల నియామకాల్లో స్ధానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గం నుంచి కీలక వ్యక్తిగా ఎంపిక చేయబడినవారు... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానంగా ఏర్పాటుచేయబడిన వ్యవస్థలో కీలకంగ ఉంటారు. ఇందులో భాగంగా... నియోజకవర్గ పోలింగ్ బూత్ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.

కాగా... రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో భాగంగా.. గత నాలుగున్నరేళ్ల కాలంలో సామాజిక న్యాయానికి తాము ఏ మేరకు ప్రాధాన్యం ఇచ్చామన్నది జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ యాత్రలు ఎలా సాగుతున్నాయో సీఎం జగన్ సమీక్షించనున్నారు.

Tags:    

Similar News