ఆరు రాష్ట్రాల ఎమ్మెల్యేలతో విశాఖలో క్రీడోత్సవం
ఇదే స్పూర్తిగా తీసుకుని విశాఖలో ఏకంగా దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులతో క్రీడా పోటీలను భారీ ఎత్తున త్వరలో నిర్వహించనున్నట్లుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పడం విశేషం.;
ఏపీలో బడ్జెట్ సెషన్ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేల క్రీడోత్సవం అంతా చూశారు. ఎంతో ఆహ్లాదకరంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించారు. మొత్తం 164 ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు . వయసు తేడా సైతం చూసుకోకుండా ఎమ్మెల్యేలు అంతా ఫుల్ జోష్ లో పాల్గొన్నారు పరుగు పందెంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ సహా ఎంతో మంది పాల్గొన్నారు. అలాగే మహిళా ఎమ్మెల్యేల పరుగు పందెం అలరించింది. కబడ్డీ క్రికెట్ సహా అనేక క్రీడలలో తమ ప్రావీణ్యాన్ని కూటమి ఎమ్మెల్యేలు చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున హాజరై తమలోని ఆటను బయటకు తీశారు.
అయ్యన్న ఆనందం :
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడోత్సాహాన్ని చూసి ఆనందభరితుడయ్యారు. ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం హర్షనీయమని అన్నారు నిరంతరం రాజకీయ ఒత్తిడితో సతమతమయ్యే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆట విడుపుగా క్రీడోత్సవంలో పాల్గొన్నారు అని అయినా ఎంతో ప్రావీణ్యం కలిగిన క్రీడాకారుల మాదిరిగా ఆడారని తమ ప్రతిభను సత్తాను చాటుకున్నారని అన్నారు. ఈ విధంగా ఏపీ శాసనసభ్యుల శాసనమండలి సభ్యుల క్రీడా మహోత్సవం-2026 లో ఎమెల్యేలు చురుగ్గా పాల్గొన్నారని అయ్యన్న కొనియాడారు. అంతే కాదు మహిళా ఎమ్మెల్యేలు అద్భుత ప్రతిభ కనబరిచారని ఆయన ప్రశంసించారు.
భారీ కార్యక్రమంగా :
ఇదే స్పూర్తిగా తీసుకుని విశాఖలో ఏకంగా దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులతో క్రీడా పోటీలను భారీ ఎత్తున త్వరలో నిర్వహించనున్నట్లుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పడం విశేషం. రెగ్యులర్ క్రీడాకారుల మాదిరిగా ఎమ్మెల్యేలు క్రీడోత్సవంలో రాణించారు అని దాంతో ఈ క్రీడాస్ఫూర్తిని చూసిన తరువాత తనకు కొత్త ఆలోచన కలిగింది అని అయ్యన్న చెప్పారు. ఆ వినూత్న ఆలోచనతోనే విశాఖ వేదికగా చేసుకుని బ్రహ్మాండమైన క్రీడా పోటీలను ఎమ్మెల్యేల మధ్య నిర్వహిస్తామని చెప్పారు. దీనికి కేవలం ఏపీ మాత్రమే కాకుండా దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలను పిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
అతి పెద్ద సంబరంగా :
విశాఖపట్నంలో నిర్వహించబోయే క్రీడోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్ఛేరి రాష్ట్రాల ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానిస్తామని అయ్యన్నపాత్రుడు ప్రకటించడం విశేషం. వారితో భారీ క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేస్తామని అన్నారు. విశాఖలో అంతర్జాతీయస్థాయి క్రికెట్ మైదానం ఉన్న నేపధ్యంలో అనువైన ప్రాంతంగా ఎంచుకున్నామని అన్నారు. అక్కడ బీచ్‌వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల నిర్వహణకు సైతం సానుకూలంగా ఉంటుందన్నారు.
ఈ పోటీలను దిగ్విజయంగా నిర్వహించి బలమైన సందేశాన్ని దేశం మొత్తానికి చాటి చెప్పేందుకు నిర్ణయించామని అయ్యన్నపాత్రుడు అన్నారు. మొత్తం మీద చూస్తే అయ్యన్న ప్రకటించినది చూస్తే దక్షిణాది రాష్ట్రాల ఎమ్మెల్యేలు అంతా విశాఖలో సందడి చేయనున్నారు. రాజకీయాలతో వారూ వీరూ పోటా పోటీగా విమర్శలు చేసుకునే క్రమం నుంచి అంతా కలసి క్రీడా స్పూర్తిని పెంచుకుంటే తప్పనిసరిగా అది రాష్ట్రాల మధ్య మంచి వాతావరణానికి దారి తీస్తుందని అంటున్నారు. మొత్తానికి అయ్యన్న ఆలోచన భేష్ అని అంతా అంటున్నారు.