జగన్‌ దృష్టి ప్రధానంగా ఈ 8 జిల్లాలపైనేనా?

ఈ 8 జిల్లాల్లో వీలైనన్ని అత్యధిక సీట్లు కొల్లగొడితే అధికారం లోకి రావడం ఖాయమని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

Update: 2023-08-03 23:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల కు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి అధికారం లోకి రావడానికి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి 175కి 175 సీట్లు సాధించాలని ఇప్పటికే ఆయన వైసీపీ నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఏపీ లో ఉన్న మొత్తం 175 సీట్లలో అధికారం లోకి రావాలంటే 88 సీట్లు సాధించాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ–జనసేన పొత్తు ఖాయమని వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీ తమతో కలిసినా, కలవకున్నా ఈ రెండు పార్టీలు మాత్రం కలసి పోటీ చేయడం ఖాయమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది.

టీడీపీ–జనసేన పొత్తు వల్ల 2014లో ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో జగన్‌ అధికారానికి దూరమయ్యారు. మరోసారి ఇలాంటిది జరగకుండా ఆయన చర్యలు చేపట్టారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా 8 జిల్లాలపైన జగన్‌ దృష్టి సారించారని చెబుతున్నారు. ఈ 8 జిల్లాల్లో వీలైనన్ని అత్యధిక సీట్లు కొల్లగొడితే అధికారం లోకి రావడం ఖాయమని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

జగన్‌ దృష్టి సారించిన 8 జిల్లాలు వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. అవి.. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలు. గతం లో ఈ ఎనిమిది జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలుగా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, చిత్తూరు పేరుతో ఉండేవి. వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేయడంతో ఈ నాలుగు జిల్లాలు 8 జిల్లాలుగా రూపాంతరం చెందాయి.

Read more!

రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 52 స్థానాలు ఉన్నాయి. 2019లో ఈ 52 స్థానాల్లో కేవలం మూడు స్థానాల ను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మిగిలిన 49 స్థానాలను వైసీపీ ఎగరేసుకుపోయింది.

ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇవే ఫలితాల ను పునరావృతం చేయాలని జగన్‌ భావిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న 8 జిల్లాల్లో కనీసం 50 స్థానాలను కొల్లగొడితే మెజారిటీ కావాల్సిన మిగిలిన 38 స్థానాల ను ఇతర జిల్లాల్లో గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరినా దాని ప్రభావం రాయలసీమ పై పెద్దగా ఉండకపోవచ్చని జగన్‌ భావిస్తున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో రాయలసీమ లో వైసీపీ 50 స్థానాలు గెలుచుకోగలిగితే మిగతా 38 స్థానాల ను గెలుచుకోవడం పెద్ద కష్టం కాబోదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఈ 8 జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారని అంటున్నారు.

Tags:    

Similar News