జగన్ వర్సెస్ షర్మిల...ఒకేసారి పాదయాత్రకు రెడీ !
ఏపీలో విచిత్ర రాజకీయం సాగుతోంది. ఒకే కుటుంబం అందులోనూ ఎంతో ప్రఖ్యాతి గడించిన వైఎస్సార్ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు ఇద్దరూ విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు.;
ఏపీలో విచిత్ర రాజకీయం సాగుతోంది. ఒకే కుటుంబం అందులోనూ ఎంతో ప్రఖ్యాతి గడించిన వైఎస్సార్ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు ఇద్దరూ విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు. ఏ కుటుంబంలో అయినా రెండు పార్టీలు వేరు రాజకీయాలు చేయడం మామూలు విషయమే. కానీ ఇక్కడ అలా కాదు షర్మిల జగన్ మీదనే తన రాజకీయ దాడి చేస్తున్నారు. వైసీపీని పూర్తిగా తగ్గించాలని ఆమె రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. దానికి కారణం ఉంది. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చినదే. దాంతో పాటు వైఎస్సార్ చరిష్మా కూడా వైసీపీకి మరో అడ్వాంటేజ్. దాంతో వైఎస్సార్ వారసత్వం తనది అంటూ షర్మిల జగన్ ని రాజకీయంగా సవాల్ చేస్తున్నారు. అందుకే ఆమె ఏరి కోరి ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు. పీసీసీ చీఫ్ గా ఆమె ఉంటూ జగన్ రాజకీయాన్ని గట్టిగా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చే ఏడాది పాదయాత్ర :
ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 లో జరిగే ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివి అన్నది తెలిసిందే. ఈసారి కనుక గెలిస్తే వైసీపీ మరింత బలంతో దీర్ఘకాలం కొనసాగుతుంది. పొరపాటున ఓడితే మాత్రం ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంటోంది. జగన్ విషయమే తీసుకుంటే పాదయాత్రతో ఈసారి ఏపీలోని అణువణువూ చుట్టేయాలని చూస్తున్నారు. దానికి తగిన విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ చోటా ప్రతీ ఏరియాను టచ్ చేయాలని జగన్ చూస్తున్నారు. అంతే కాదు ఏకంగా అయిదు వేల కిలోమీటర్ల పైగా సుదీర్ఘమైన పాదయాత్రకు జగన్ సిద్ధపడుతున్నారని సమాచారంగా ఉంది.
తండ్రి జయంతి వేళ :
దానికి వైసీపీ ఒక మంచి ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకుంది. 2027లో వైఎస్సార్ జయంతి అయిన జూలై 8 నుంచి పాదయాత్రకు జగన్ సిద్ధపడతారని అంటున్నారు. ఆ పాదయాత్ర 2029 ఎన్నికల ముందు వరకూ కొనసాగుతుందని అంటున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ని రూపొందించే పనిలో వైసీపీ ప్రస్తుతం ఉంది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా వైసీపీలో సమిష్టి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం గ్రామ స్థాయి వరకూ పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో నియామకం చేయడం ద్వారా జగన్ పాదయాత్రలో ఉన్నా కూడా పూర్తి ఫోకస్డ్ గా అలెర్ట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తం మీద జగన్ పాదయాత్ర అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉండబోతోంది. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగేలా ఈ పాదయాత్ర ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు.
షర్మిల సైతం :
అయితే అదే సమయంలో మరో వార్త కూడా ఏపీ రాజకీయాల్లో ప్రచారంలో ఉంది. పీసీసీ చీఫ్ షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధపడుతున్నారు అన్నదే ఆ వార్త. ఆమె కూడా జగన్ పాదయాత్రకు కాస్తా ముందో వెనకో తాను కూడా పాదం కదుపుతారు అని అంటున్నారు. షర్మిల విషయానికి వస్తే ఉమ్మడి ఏపీలో జగన్ జైలులో ఉన్నపుడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు. చేవెళ్ళ టూ ఇచ్చాపురం పేరుతో ఆమె నాడు పాదయాత్ర వైసీపీ కోసం చేశారు. ఆ తరువాత 2022 లో తెలంగాణాలో పార్టీ పెట్టి అక్కడ కూడా షర్మిల భారీ పాదయాత్ర చేశారు. దాంతో ఇపుడు ముచ్చటగా మూడోసారి ఏపీలో పాదయాత్రకు ఆమె సిద్ధం అవుతున్నారు అని అంటున్నారు. జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల పాదయాత్ర సాగితే కనుక ఏపీ రాజకీయాలు హీటెక్కడం ఖాయమని అంటున్నారు. మరి జగన్ కూటమి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు. షర్మిల రాజకీయ విమర్శలు ఎలా ఉండబోతాయి అన్న దానిని చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అన్నా చెల్లెలు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చి పాదయాత్ర చేస్తే మాత్రం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది కూడా ఉంది.