జగన్ 2014...జగన్ 2024...తేడా ఏమిటి ?
ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణం చేసిన చంద్రబాబు ప్రతీసారి ఒక మాట అంటూ ఉంటారు. తాను 1995 నాటి సీఎంగా ఉంటాను అని.;
ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణం చేసిన చంద్రబాబు ప్రతీసారి ఒక మాట అంటూ ఉంటారు. తాను 1995 నాటి సీఎంగా ఉంటాను అని. ఆయన అప్పట్లో దూకుడుగా ఉండేవారు. పార్టీ జనాలు సాదర జనాలూ అదే కోరుకోవడంతో బాబు మళ్ళీ తన మునుపటి రూపం చూపిస్తాను అంటున్నారు. ఇది రాజకీయ నాయకులలో రావాల్సిన మార్పు. అతి ముఖ్య లక్షణం కూడా. అయితే టీడీపీ లాగానే ఆవిర్భవించిన మరో ప్రాంతీయ పార్టీ వైసీపీలో అయితే ఈ మార్పులు మార్చుకోవడాలూ ఆత్మ పరిశీలనలూ అన్నవి కరెక్ట్ దారిలో సాగుతున్నాయా అన్నదే పార్టీలో అంతా చర్చించుకుంటున్నారు.
నాడు దూకుడేదీ :
అంతా జగన్ ని 2014 లోనూ 2024 తర్వాత గా చూస్తూ విశ్లేషిస్తున్నారు. జగన్ లో ఆనాటి దూకుడు ఇపుడు ఏదీ అన్న చర్చ అయితే అంతటా ఉంది అంటున్నారు. 2014లో జగన్ ఓటమి పాలు కాగానే చాలా తొందరగా దాని నుంచి బయటపడ్డారు. అంతే కాదు వరుసగా మూడేళ్ళ పాటు అసెంబ్లీ వేదిక మీద నాటి టీడీపీ ప్రభుత్వం తో పోరాటం చేశారు. అలాగే మరో వైపు జనంలోనూ ఉంటూ వచ్చారు. అలా రెండిందాలుగా తన కత్తికి పదును ఉందని ఆయన నిరూపించారు. 2017లో అయితే ఆయన ఏకంగా జనంలోకే వచ్చేశారు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాంతో జగన్ కి 2019లో అధికారం బంపర్ మెజారిటీతో దక్కింది.
ఏవీ ఆనాటి వెలుగులు :
ఆనాటి వెలుగులు వైసీపీలో ఇపుడు ఏవీ అని అంతా అంటున్నారు. ఇపుడు చూస్తే జగన్ అసెంబ్లీకి వెళ్ళడం మానుకున్నారు. అలా ప్రజలకు తనకు ఇచ్చిన చట్ట సభ వేదికగా అధికార పార్టీని నిలదీయాలన్న అధికారాన్ని వాడడంలేదు అని అంటున్నారు. ఇక జనంలోకి కూడా ఆయన వెళ్ళడం లేదు ఓడి పదిహేను నెలలు అవుతున్నా జగన్ జనం వద్దకు వెళ్ళడం అన్నది లేకుండా పోతోంది గత ఏడాది డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలు అన్నారు. అవి కాస్తా ఈ ఏడాది మొదటికి వాయిదా పడ్డాయి అలా మళ్ళీ వాయిదాలు పడుతూడగానే ఈ ఏడాది ఎనిమిది నెలలు గడచిపోయింది జగన్ మాత్రం జిల్లా పర్యటన ఎప్పుడు చేస్తారు అన్నదే చర్చగా ఉంది.
ఇమేజ్ ని చూసుకుని :
జగన్ కి జనాదరణ ఉంది. అది ఎవరూ కాదనడం లేదు. కానీ అది ఒక్కటే పార్టీ విజయానికి సరిపోదని అంటున్నారు. ఆయన అపుడపుడు జనంలోకి వస్తున్నారు. అవి బలప్రదర్శన గానే మారుతున్నాయి. జనంతో జాతర చేస్తున్నట్లుగానే ఉంది. అలా వచ్చి జనాలు జగన్ తో ఉన్నారు అనిపించుకోవడం జరుగుతోంది. కానీ జగన్ అంతకు మించి ఏమీ చేయడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి.
ఇంకా ధీటుగానే :
నిజం చెప్పాలీ అంటే 2014 కంటే ఇపుడు మరింతగా కష్టపడాల్సి ఉంది అని అంటున్నారు. అప్పట్లో తెలుగుదేశం ఒక్కటే ప్రభుత్వంలో ఉంది. ఇపుడు మూడు పార్టీలు ఉన్నాయి. బలంగా కూటమి కనిపిస్తోంది. పైగా జగన్ మీద ఆనాటి మోజు ఇపుడు ఉందా అన్నది మరో చర్చ. ఎందుకంటే జగన్ పాలన అన్నది జనాలు చూసేశారు. దాంతో ఆయన తన పాలనలో లోపాలను సరిచేసుకుని జనాల ముందుకు రావాల్సి ఉంది. అలాగే వివిధ అంశలా మీద ఆయన జనాలకు భరోసా ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా పార్టీ జనాలకు కూడా తాను మారాను అని కచ్చితంగా చెప్పాల్సి ఉంది. అయితే జగన్ మాత్రం ఆనాటి దూకుడుని కంటిన్యూ చేయడం లేదనే అంటున్నారు.
యాంటీ ఇంకెంబెన్సీతోనే :
ఒక్క యాంటీ ఇంకెంబెన్సీ తోనే అధికారాలు చేతులు మారిన సందర్భాలు బహు తక్కువ. అవతల పక్షం మీద వ్యతిరేకత మరీ విపరీతంగా ఉన్నా అది ఒక యాభై శాతం మాత్రమే సహకరిస్తుందని మరో యాభై శాతం అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ పట్ల సానుకూలత కూడా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. ఈ విషయంలో కనుక వైసీపీ సర్దుకోకపోతే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా వారు అక్కడ నిబంధనల మేరకే ఆట ఆడాల్సి ఉంటుంది. తాము సొంతంగా తాము అనుకున్న తీరున రాజకీయ ఆట ఆడుతామంటే అది వారికే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.