జగన్ విత్ విజయ్ : వైసీపీ కొత్త మిత్రుడు !

ఈ నేపథ్యంలో తమిళనాడులో 2024 లో టీవీకే పార్టీని విజయ్ స్థాపించారు. ఆయన రెండేళ్ళు తిరగకుండా సీఎం అయ్యారు.

Update: 2026-05-14 00:30 GMT

వైసీపీని రాజకీయంగా ఒంటరి అని అంటారు. ఆ పార్టీ కూడా తాము సోలోగా వస్తామని చెబుతూ ఉంటుంది. సింహం సిగిల్ అన్నది వైసీపీ పేరు వెనక ఉన్న ట్యాగ్ లైన్. వైసీపీ రాజకీయ ప్రస్థానంలో మిత్రులు అంటే పెద్దగా ఎవరూ కనిపించరు. అయితే 2014 తరువాత మాత్రం తెలంగాణా నాటి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ తో జగన్ స్నేహం కొంతవరకూ కనిపించింది. అది కాస్తా బాహాటం అయింది జగన్ సీఎం గా నెగ్గాకనే. జగన్ సీఎం గా ప్రమాణం చేసిన సందర్భంగా కేసీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ తరువాత జగన్ ప్రగతి భవన్ కి వెళ్ళారు. ఈ ఇద్దరు అధి నేతల మధ్య అనేక సార్లు ముచ్చట్లు సాగాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆనాడు ఎవరూ చూడని అరుదైన రాజకీయ సన్నివేశంగా దీనిని చెబుతారు. ఇక జగన్ ప్రమాణ స్వీకారానికి మరో అతిధి కూడా వచ్చారు. ఆయనే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ఆయన కూడా జగన్ కి మిత్రుడే. ఇక స్టాలిన్ సీఎం 2021లో అయ్యారు. జగన్ ఏపీలో స్టాలిన్ తమిళనాడులో తెలంగాణాలో కేసీఆర్ ఇలా ముగ్గురు మిత్రుల కధగా నాడు సాగింది అని చెబుతారు.

విజయ్ వైపు అలా :

ఈ నేపథ్యంలో తమిళనాడులో 2024 లో టీవీకే పార్టీని విజయ్ స్థాపించారు. ఆయన రెండేళ్ళు తిరగకుండా సీఎం అయ్యారు. అయితే విజయ్ జగన్ మధ్య మంచి స్నేహం ఉంది అన్న సంగతి రెండు నెలల క్రితమే లోకానికి తెలిసింది. జగన్ సోదరుడి కుమారుడి వివాహం చెన్నైలో జరిగింది. దానికి విజయ్ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా జగన్ విజయ్ కలసి కూర్చుని మాట్లాడిన విజువల్స్ అన్నీ బయటకు వచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మే 4న విజయ్ విజయం తరువాత జగన్ ట్వీట్ చేస్తూ తన ప్రియమైన సోదరుడిగా ఆయన్ని అభివర్ణించారు. విజయ్ మేలు కోరుకున్నారు. అప్పటికి విజయ్ పార్టీకి 108 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ తరువాత కాంగ్రెస్ ఇతర మిత్రుల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణం చేశారు ఆ సమయంలో జగన్ లండన్ లో ఉన్నారు. తాజాగా జగన్ లండన్ టూర్ ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు.

జగన్ నుంచి ఫోన్ కాల్ :

ఈ నేపథ్యంలో బుధవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్షలో నెగ్గారు. దాంతో వైసీపీ అధినేత విజయ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు గ్రీట్స్ చెప్పారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సమర్ధవంతమైన పాలనను పారదర్శకమైన పాలనను అందిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో విజయ్ పనిచేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు విజయ్ మీద ఎంతో విశ్వాసం ఉంచారని కూడా జగన్ అన్నారు. దానిని నిలబెట్టుకుని తమిళనాడు అభివృద్ధికి సమగ్రమైన పాలనతో పాటు ప్రజా సంక్షేమం కూడా చేస్తూ ముందుకు సాగాలని జగన్ కోరుకున్నారు. అంతే కాదు విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలకమైన పాత్ర పోషించాలని కూడా జగన్ పేర్కొన్నారు.

బలపడుతున్న బంధం :

ఈ విధంగా జగన్ గతంలో ఎవరి విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించింది లేదని అంటారు. కేసీఆర్ స్టాలిన్ లతో ఆయన చెలిమి చేసినా వయసు రిత్యా వారు తండ్రుల స్థానంలో ఉన్న వారు. అదే విజయ్ అయితే సమకాలీనుడు. పైగా జగన్ మాదిరిగానే ఒంటరిగా పోరు అంటున్నారు. అలాగే పొలిటికల్ ఫిలాసఫీ కూడా సరిపోయేలా ఉందని అంటున్నారు. అందుకే విజయ్ విషయంలో జగన్ మైత్రిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు అని అంటున్నారు.

కాంగ్రెస్ ఫ్రెండ్ షిప్ :

నిజానికి చూస్తే విజయ్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్ కి ఎంతో నైతిక మద్దతు ఇచ్చాయి. ఆ తరువాతనే మిగిలిన పార్టీలు అన్నీ ఒక్కోటిగా వచ్చి చేరాయి. అంతే కాదు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిధిగా వచ్చి మరీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. విజయ్ ఆయన్ని తన అన్నయ్యగా సంభోదించారు. మరి రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ విషయంలో వైసీపీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకే విజయ్ విషయంలో వైసీపీ దూరం పాటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ దానిని భిన్నంగా ఫోన్ కాల్ కలిపి మరీ జగన్ ముచ్చటించారు అంటే రానున్న రోజులలో ఏపీ రాజకీయంతో పాటు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ఏమైనా కొత్త సమీకరణలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి జగన్ విత్ విజయ్ ఏ ఈక్వేషన్స్ ని క్రియేట్ చేస్తుందో.

Tags:    

Similar News