నిర్ణయం మార్చుకున్న జగన్.. సర్కారుతో అమీతుమీ తేల్చుకోవడమేనట..!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ జనం బాట పట్టనున్నారు. వచ్చే నెలలో రాజమండ్రి లేదా కర్నూలులో వైసీపీ తరఫున నిర్వహించే ధర్నాకు జగన్ హాజరుకానున్నారు.;
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ జనం బాట పట్టనున్నారు. వచ్చే నెలలో రాజమండ్రి లేదా కర్నూలులో వైసీపీ తరఫున నిర్వహించే ధర్నాకు జగన్ హాజరుకానున్నారు. అదేవిధంగా దసరా తర్వాత జిల్లాల పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం పేరిట జనంలోకి వస్తున్న జగన్.. పార్టీ పరమైన కార్యక్రమాలను అడపాదడపా మాత్రమే నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలోనే కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతున్నారు. అయితే ఇకపై క్షేత్రస్థాయిలోనూ పార్టీకి ఊపు తేవాలన్న ఆలోచనతో జిల్లాల పర్యటనకు రూట్ మ్యాప్ తయారు చేయాలని పార్టీ వర్గాలను అధినేత ఆదేశించినట్లు సమాచారం.
రైతు సమస్యలపై పోరుబాట
గుంటూరు మిర్చియార్డు, పొదిలిలో పొగాకు రైతులు, బంగారుపాళ్యంలో మామిడి రైతులు ఇలా ఒక్కో అంశాన్ని హైలెట్ చేస్తూ ఇన్నాళ్లు జగన్ పర్యటనలు సాగేవి. ఇదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు పోరు, కరెంటు చార్జీలు, వ్యవసాయ సమస్యలపై పోరాటం వంటి కార్యక్రమాలకు జగన్ హాజరుకాలేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఆయన రాష్ట్రంలో ఉన్నా కూడా కేడర్ అంతా పాల్గొనేలా దిశానిర్దేశం చేశారే తప్ప, అధినేతగా జగన్ ఎక్కడా పాల్గొనలేదు. దీనికి కారణం కూటమి ప్రభుత్వానికి ఏడాది వరకు సమయం ఇవ్వాలనే. అదేసమయంలో అత్యావసర సమయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ నేరుగా పోరాడారని చెబుతున్నారు.
జిల్లాల పర్యటనలకు ప్రణాళిక
ఇక ప్రభుత్వం ఏర్పడి 15 నెలల అవడం, జమిలి ఎన్నికలు జరిగితే ఏడాది ముందుగానే ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావొచ్చనే అంచనాతో కార్యక్షేత్రంలోకి దిగాలని వైసీపీ అధినేత జగన్ తాజాగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించిన జగన్.. ఈ లోగా జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నేరుగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నెలా రెండు రోజుల పాటు జిల్లాల్లో గడపాలని భావిస్తున్న జగన్, ఆ రెండు రోజులు పూర్తిగా జిల్లాలో పార్టీ పరిస్థితి, కేడర్ సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.
ఇక ధర్నాల్లో జగన్
ఇదే సమయంలో సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు తాను కూడా ఇక నుంచి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం వచ్చేనెలలో దివ్యాంగ పింఛన్ల తొలగింపుపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం దివ్యాంగుల పింఛన్ల పరిశీలనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పింఛన్ల వడబోతకే సర్కారు ఈ విధంగా చేస్తోందని, అనర్హుల పేరిట తమ పింఛన్లను తొలగిస్తారనే భయంతో చాలా చోట్ల దివ్యాంగులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు వైసీపీ పరోక్షంగా సహకరిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అయితే తాజాగా వైసీపీయే ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడంతో సమస్య రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
పింఛన్ల కోతపై సీరియస్
వచ్చేనెల నుంచి పింఛన్ల కోతపై ఆందోళనకు పిలుపునివ్వాలని భావిస్తున్న వైసీపీ.. రాజమండ్రి లేదా కర్నూలులో నిర్వహించనున్న ధర్నాలో అధినేత హాజరయ్యేలా వ్యూహం రచిస్తోందని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీకి బలమైన పట్టు ఉండగా, గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. రాయలసీమకు ముఖద్వారంగా చెప్పే కర్నూలులో మళ్లీ పుంజుకుంటే ఆటోమెటిక్ గా రాయలసీమపై ఆ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో జగన్ పాల్గొనే తొలి పోరు కార్యక్రమానికి రాయలసీమ వేదికైతే బాగుంటుందని చర్చిస్తున్నారు. ఇదే సమయంలో కోస్తాలో ఇంతవరకు వైసీపీ అధినేత పర్యటన లేకపోవడం, గత ఎన్నికల్లో ఆ ప్రాంతంలో పూర్తిగా చతికిలా పడటంతో కేడర్ లో ఊపు తేడానికి రాజమండ్రి అయితే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు చోట్ల ఎక్కడ పాల్గొనాలనేది అధినేత నిర్ణయానికి వదిలేయాలని నేతలు భావిస్తున్నారు. ఏదిఏమైనా ధర్నాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఆసక్తి రేపుతోంది.