చంద్రబాబు బెదిరించారు.. ఆ తర్వాత నాన్న చనిపోయారు! జగన్ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన జగన్ తన తండ్రి మరణం, తాత, బాబాయ్ హత్యపై సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన జగన్ తన తండ్రి మరణం, తాత, బాబాయ్ హత్యపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు పదేపదే చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించిన జగన్.. ఎవరిది గొడ్డలిపార్టీ, ఎవరిది గన్ కల్చర్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు. మేం బాధతులం. హత్యా రాజకీయాలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి కల్పిత కథలు అల్లుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారని ఆరోపించారు. జాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. వైసీపీపై బురద జల్లాలని చూస్తున్నారని, కల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి, తమ్ముడు వివేకానందరెడ్డి హత్యలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా తాత రాజారెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నారని జగన్ గుర్తు చేశారు. మా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగంతో నిందితులను రక్షించారు. మా నాన్న రాజశేఖరరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత నాలుగు రోజులకే హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మరణించారని జగన్ ఆరోపించారు. అవసరమైతే అసెంబ్లీ క్లిప్పుంగులను చూపాలని సూచించారు. మా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాలేదని చెప్పారు.
ఇక మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకా హత్యపైనా మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా చిన్నాన్న వివేకాను అవినాశ్ చంపించారని ప్రచారం చేశారు. అవినాశ్ కోసం వివేకా పనిచేశారని జగన్ చెప్పారు. వివేకాను చంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడని, ఆయన లాయర్, చంద్రబాబు లాయర్ ఒక్కరేనని వెల్లడించారు. క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలని సవాల్ విసిరారు.
విజయవాడలో వంగవీటి రంగా హత్యతోపాటు ఎన్ కౌంటర్ పత్రిక ఎడిటర్ దశరథ్ రామ్ దారుణ హత్యకు గురైన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో గన్ తో ఇద్దరిని కాల్చేయలేదా? ఎవరిది గన్ కల్చర్? చంద్రబాబు హత్యా రాజకీయాలపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారంటూ జగన్ గుర్తు చేశారు.