బొద్దింకల జోరు తగ్గగానే... ఈ20 సెగ మొదలైంది..

ఇటీవలే దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'నీట్ పేపర్ లీక్' వివాదంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ 'సీజేపీ ఏకంగా 36 రోజుల పాటు డిజిటల్ నిరసన తెలపడం..

Update: 2026-07-27 12:35 GMT

మొన్నటికి మొన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వచ్చి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిందో లేదో... అంతలోనే ఇంకో కొత్త ముఠా రంగంలోకి దిగింది. దేశంలో ఆందోళనల వేడి చల్లారకముందే బొద్దింకలు కాస్త సర్దుకుని తమ బిలాల్లోకి వెళ్లేలోపే ఇప్పుడు 'పీతల పార్టీ' పేరిట కొత్త బ్యాచ్ చెలరేగిపోతోంది. ఈసారి వీరి టార్గెట్ మరెవరో కాదు... మన లీటరు పెట్రోల్‌లో చుక్కల కొద్దీ 'ఇథనాల్' కలిపి పంపుతున్న కేంద్ర ప్రభుత్వ ఈ20 ఇంధన విధానమే.. సగటు వాహనదారుడు బంకులో పెట్రోల్ కొట్టించి "ఇంజిన్ నడుస్తుందో లేదో" అని భయపడుతుంటే సోషల్ మీడియా వీరులు మాత్రం ఏకంగా ఒక పార్టీ పెట్టి డిజిటల్ విప్లవానికి తెరతీశారు.

"పీత" గుర్తుతో పెట్రోల్ యుద్ధం... మలేషియా నుంచి ఆందోళన

'ఈ20 జనతా పార్టీ' పేరుతో ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో హల్‌చల్ చేస్తున్న ఈ ఆన్‌లైన్ దండు.. తమ గుర్తుగా ఏకంగా ఒక పీతను ఎంచుకుంది. "అన్యాయం ఎక్కడుంటే అక్కడ పీతల్లా పాకుతూ వ్యాపిస్తాం" అని వీరు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే మామూలుగా లేదు. ఇప్పటికే దాదాపు 27 వేల మందికి పైగా ఫాలోవర్లను కూడగట్టుకున్న ఈ బృందం.. "ఇక ఇథనాల్ వద్దు.. ఇక నిశ్శబ్దం వద్దు" అంటూ ఘాటైన నినాదాలతో హోరెత్తిస్తోంది.

అయితే ఇక్కడ అసలైన సెటైర్ ఏంటంటే... భారతదేశంలో పెట్రోల్ ధరలు, ఇథనాల్ కలుషితాల గురించి ఆవేదన చెందుతూ ఈ ఉద్యమం నడుపుతున్న అకౌంట్ లొకేషన్ మాత్రం 'మలేషియా' అని చూపిస్తోంది. దేశంలో బండిలో పెట్రోల్ కొట్టించి లబోదిబోమనేది ఇక్కడ జనాలు అయితే వీరికి బాధ మాత్రం సరిహద్దులు దాటి మలేషియాలో పొంగుకొస్తోందన్నమాట.

పీతల పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే

ఈ ఆన్‌లైన్ పీతల సైన్యం ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు వింటే ఎవరికైనా నవ్వు రాక మానదు. మమ్మల్ని బలవంతంగా ఈ20 పెట్రోల్ తాగించకండి భయ్యా ఈ20 అమ్మితే అమ్ముకోండి, కానీ పక్కనే 100% స్వచ్ఛమైన సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలి. కేవలం పెట్రోల్ ఎంపికతో ఆగుతారా ఏంటి? ఉద్యమం అన్నాక ఒక వికెట్ పడాల్సిందే అన్నట్లు... కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వెంటనే రాజీనామా చేయాలని వింత పోస్టులు పెడుతున్నారు. "మేము ఇథనాల్‌కు వ్యతిరేకం కాదు గురూ... కాకపోతే మాకు పెట్రోల్ ఎంచుకునే స్వేచ్ఛ మాత్రమే కావాలి" అని చాలా సాధువుల్లా చెప్తూనే మరోవైపు కేంద్ర మంత్రుల రాజీనామాలను డిమాండ్ చేయడం ఈ 'పీతల'కే చెల్లింది!

ప్రభుత్వం ఏమంటోంది?

మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సోషల్ మీడియా రచ్చ చూసి తలపట్టుకుంటోంది. "నాయనా... విదేశాల నుంచి బిలియన్ల డాలర్లు పోసి తెచ్చుకునే ముడి చమురు దిగుమతులను తగ్గించి, మన దేశీయ రైతులు పండించే పంటల నుంచి ఇథనాల్ తయారు చేసి.. పర్యావరణాన్ని కాపాడదామంటే ఈ పీతల గోల ఏంటి?" అని లబోదిబోమంటోంది.

ఆటోమొబైల్ తయారీ సంస్థలు, ఇంజనీరింగ్ నిపుణులు, టెస్టింగ్ ఏజెన్సీలతో వేల గంటలు సంప్రదింపులు జరిపామని... ఇంజిన్ పనితీరు, మైలేజీ, ఉద్గారాల నియంత్రణపై అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యాకే ఈ20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చామని ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నా, ఈ డిజిటల్ పీతలు మాత్రం శాంతించేలా లేవు.

బొద్దింకల బాటలోనే పీతల ప్రయాణం

ఇటీవలే దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'నీట్ పేపర్ లీక్' వివాదంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ 'సీజేపీ ఏకంగా 36 రోజుల పాటు డిజిటల్ నిరసన తెలపడం.. ఆ తర్వాత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ప్రకటన రాగానే ఆ ఉద్యమాన్ని విరమించుకోవడం మనం చూశాం.

ఇప్పుడు సరిగ్గా అదే 'సీజేపీ' పంథాలోనే ఈ ఈ20 పీతల పార్టీ కూడా స్క్రిప్ట్ ప్లే చేస్తోంది. మరి ఈ పీతల ఆందోళన కేవలం 'ఎక్స్'లో లైక్‌లు, రీట్వీట్లు, మీమ్స్‌కే పరిమితమవుతుందా? లేక నిజంగానే రోడ్లపైకి వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర పీతల దండయాత్రగా మారుతుందా? అనేది రానున్న రోజుల్లో చూడాలి..

Tags:    

Similar News