టీడీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు.. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన వర్మ.. ఎమ్మెల్యే బొండా ఉమాపై ఫైర్
ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ నేతల స్వరాల్లో మార్పు కనిపిస్తోంది.
అధికార టీడీపీలో రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ నేతల స్వరాల్లో మార్పు కనిపిస్తోంది. అయితే అధిష్టానానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన నేతలే ఇప్పుడు వ్యతిరేక ప్రకటనలు చేస్తుండగా, అసంతృప్తితో రగిలిపోతున్నారని భావిస్తున్న నేతలు అనూహ్యంగా అధిష్టానంపై విశ్వాసం చూపుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారణంగా అధిష్టానానికి దూరమయ్యారనే ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే బొండా అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడుతుండగా, చిత్రంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన వ్యవహారశైలిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలు అధికార కూటమిలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
రెండు రోజుల క్రితం గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాపుల్లో అలజడి ఉందని, కాపుల ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాలని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కాపుల ఆగ్రహమే కారణమని చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటితో సన్నిహితంగా వ్యవహరించడం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. కాపు నాయకుడిగా సొంత సామాజికవర్గం సమస్యలపై మాట్లాడటం తప్పులేనప్పటికీ, వ్యక్తిగత అజెండాతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా ఎమ్మెల్యే బొండా మాట్లాడారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీశాయి. మరోవైపు, ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో అధిష్టానం కూడా సీరియస్ అయింది. దీనిపై వివరణ తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఆదేశించినట్లు సమాచారం.
గత రెండు రోజులుగా ఎమ్మెల్యే బొండా వ్యాఖ్యలపైనే టీడీపీలో హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ నేతలు ఎవరూ పెద్దగా పెదవి విప్పకపోయినప్పటికీ, ఆశ్చర్యకరంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. బొండా వ్యాఖ్యలపై మిగతా నేతలు అంతర్గతంగానే గుసగుసలాడుతుండగా, వర్మ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎమ్మెల్యే ఉమాపై విమర్శల దాడి చేశారు. కాపులను ఉద్ధరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. 2019లో ముద్రగడ కారణంగా టీడీపీ ఓడిపోయిందనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని గుర్తుచేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్, విదేశీ విద్య, స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చిన అంశాలను వివరించారు. ఈ విధంగా టీడీపీ అధిష్టానాన్ని వర్మ పూర్తిస్థాయిలో వెనకేసుకొచ్చారు. పార్టీ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా వర్మ ఈ విషయంలో మాట్లాడటం పెద్ద వింతేమీ కాకపోయినా, ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ఇలా ఘాటు విమర్శలతో ఎమ్మెల్యేపై విరుచుకుపడటం పార్టీ కేడర్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ.. ఆ తర్వాత అధిష్టానం సానుకూల దృక్పథానికి దూరమయ్యారనే ప్రచారం జరిగింది. పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు నామినేటెడ్ పదవి ఇస్తామన్న హామీని అధిష్టానం విస్మరించడమే కాకుండా, ఆయనను పార్టీ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ పరిణామాలతో వర్మ అసంతృప్తికి లోనయ్యారని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం అంతా ఉట్టిదేనంటూ ఆయన ఈరోజు స్పష్టమైన సంకేతాలు పంపారు. తనకు పదవులు దక్కకపోయినా, క్రమశిక్షణ గల కార్యకర్తగా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారంటూ వర్మపై కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా మాత్రం కార్యకర్తలు, అధిష్టానం ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తానికి, ఎమ్మెల్యే బొండా ఎపిసోడ్‌లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంట్రీ ఇచ్చిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.