బందిపోట్లలా ఓట్లు దొంగిలించారు.. పులివెందులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ నాయకులు బందిపోట్లలా ఓట్లు దొంగిలించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు.;
పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ నాయకులు బందిపోట్లలా ఓట్లు దొంగిలించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా వారికి సహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరించిందని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు జగన్. ప్రజలను భయబ్రాంతులను చేశారని, పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. ఓట్లు దొంగిలిస్తూ బందిపోట్లలా వ్యవహరించిన టీడీపీ నేతలు పులివెందులలో చంబల్ లోయను గుర్తు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్.
పులివెందులలో ఎన్నిక నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చాలెంజ్ చేస్తున్నానని, మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే, మంచి చేశారని అనుకుంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారని అనుకుంటే, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నిక జరగాలని కోరారు. పచ్చచొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నిక ఏకపక్షంగా నిర్వహించుకున్నారని అన్నారు. దాదాపు ఏడు వేల మంది పులివెందులలో మోహరించారని, ఒక్కో ఓటరకు ఒక్కో రౌడీతో బెదిరించారని ఆరోపించారు.
టీడీపీ మంత్రులు, నాయకులు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో తిష్టవేసి బెదిరింపులకు దిగారన్నారు. ఎర్రబెల్లిలో మంత్రి సవిత, నల్లపురెడ్డిపల్లెకు జమ్మలమడుగు నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలతో ఆదినారాయణరెడ్డి తిష్ట వేశారని, ఈ-కొత్తపల్లిలో ఎమ్మెల్యే చైతన్యరెడ్డి కార్యకర్తలతో దౌర్జన్యం చేశారని జగన్ ఆరోపించారు. బీటెక్ రవికి పులివెందులలో ఓటు లేకపోయినా కనంపల్లి గ్రామంలో తిష్ట వేసి దౌర్జన్యం చేశారని చెప్పారు. పోలింగు కేంద్రాలకు వైసీపీ ఏజెంట్లు వెళితే వారిని కొట్టి పత్రాలను చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ నేతలకు దమ్ముంటే వెబ్ కాస్టింగును బయటపెట్టాలని డిమాండ్ చేశారు జగన్. పోలింగు బూతుల ఆవరణలో సీసీ పుటేజీ ఇచ్చే ధైర్యం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారు. ఎలా బూతులు ఆక్రమించుకున్నారన్న విషయాలను తాము బయటపెడతామని చెప్పారు. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకులను లీడర్ అనరని, వారిని మోసగాడు అంటారని జగన్ చెప్పారు. ఏ ఊరి ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటేయాలని కానీ, ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా చంద్రబాబు కుట్ర ద్వారా పోలింగు బూతులను అటు ఇటు మార్చేశారని ఆరోపించారు. ఎర్రబల్లె నుంచి నల్లపురెడ్డిపల్లెకు.. మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు మార్పులు చేశారని చెప్పారు. దీనివల్ల కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు ఓట్లు వేశారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి సాక్ష్యంగా మీడియా సమావేశంలో కొన్ని ఫొటోలు ప్రదర్శించారు. తమ ఏజెంట్లు లేకపోవడం వల్ల పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఓట్లు వేసుకున్నారని జగన్ తెలిపారు.
రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఏనాడూ ఎన్నికలు జరగలేదని చెప్పిన జగన్, ప్రజాస్వామ్యం ఇంత దిగజారిన పరిస్థితులు ఎప్పుడూ ఏనాడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పోలింగు సందర్భంగా జరిగిన దాడులతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వెల్లడైందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇంత హింస జరగలేదని, బందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం, రాక్షస పాలన, ఆయనొక మాబ్ స్టర్, ఫ్రాడస్టర్ అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు జగన్. ఈ రోజు కూడా రీ పోలింగు సందర్భంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుంటున్నారన్నారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. మహిళా ఏజెంట్లపై సైతం దాడులు చేశారన్నారు.