రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు.. జగన్ ఫస్ట్ రియాక్షన్
గత వారం రోజులుగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తొలిసారిగా స్పందించారు.;
గత వారం రోజులుగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తొలిసారిగా స్పందించారు. గత నెల 21న తెలంగాణలో నీటి వినియోగంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు చేయడంతో మొదలైన వేడి రెండు రాష్ట్రాల్లో రాజకీయ సెగలు పుట్టించింది. కేసీఆర్ విమర్శలు, ఆరోపణలపై స్పందించిన తెలంగాణ సర్కార్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణ జలాలను వినియోగంపై వివరణ ఇస్తూ ఏపీలో నిర్మిస్తున్న ‘రాయలసీమ లిఫ్ట్’ తాను ఆపించానని ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణా జలాల అంశం ఏపీ రాజకీయాలను సునామీలా తాకింది.
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ టీడీపీ ఈ అంశంపై వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఈ రెండు పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజం లేదని వివరణ ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావు ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక టీడీపీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలతో ఆత్మరక్షణలో పడిపోయి ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తొలిసారిగా ఈ వివాదంపై జోక్యం చేసుకున్నారు. తమ ప్రభుత్వంలో ఏం జరిగింది? ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్ ఎలా ఉందన్న విషయాలపై జగన్మోహనరెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ను తాను ఆపించానని, తనపై గౌరవంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని జగన్మోహనరెడ్డి ఎత్తిచూపారు. రాయలసీమ లిప్ట్ పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు స్వార్థం కోసం తనకు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని జగన్ రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉండాలని, పోతిరెడ్డిపాడుకు 7 వేల క్యూసెక్కుల నీరు రావాలంటే 854 అడుగుల ఎత్తులో నీళ్లు తోడుకోవాలని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 2, 3 సార్లే నీటిని తీసుకున్నాం, కల్వకుర్తిని 25 నుంచి 50 టీఎంసీలకు పెంచారు. పాలమూరు-రంగారెడ్డి, డిండిని డిజైన్ చేశారు. ఎస్ఎల్బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తోడుకోవడానికి తెలంగాణ ప్రణాళికలు వేస్తోందని ఆరోపించారు. కానీ ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమీ అనలేకపోతున్నారు. నోరు మెదపలేక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడం వల్ల రాయలసీమ ప్రజలకు చంద్రగ్రహణం పట్టిందని, చంద్రబాబు దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ ను ఖూనీ చేశారని ఆరోపించారు.