విషయాన్ని బట్టి.. రాజకీయం.. ఇదీ కళాపోషణే ..!
రోగాన్ని బట్టి మందు ఇవ్వడం.. విషయాన్ని బట్టి రాజకీయం చేయడం అనేది లేకపోతే.. ప్రజలు మెచ్చరు.;

రోగాన్ని బట్టి మందు ఇవ్వడం.. విషయాన్ని బట్టి రాజకీయం చేయడం అనేది లేకపోతే.. ప్రజలు మెచ్చరు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా. రోగమొకటైతే.. మందు మరొకటి వేస్తే.. ఫలితం ఉంటుందా? అలానే.. రాజకీయాలు కూడా మారుతున్నాయి. ఎప్పటికి.. ఏ గూటి దగ్గర ఆ పాట పాడాలి. అంతకు మించితే.. పాట వెగటు పుడుతుంది. నేరుగా విషయంలో వస్తే.. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో జరుగుతున్న రాజకీయాలను గమనిస్తే.. `కళా పోషకులు` దారి తప్పుతున్నట్టే కనిపిస్తోంది.
ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. 'రాజకీయ కళా పోషణ' పక్కదారి పట్టిందని జనాలే నవ్వుకుంటున్నారు. మహాకవి 'శ్రీశ్రీ'ది ప్రపంచ బాధ అయితే.. దేవులపల్లి బాధ ప్రపంచ బాధ అయిందన్నట్టుగా.. తన బాధను,.. తన గ్రాఫును.. ప్రజలపై రుద్ది ప్రత్యర్థి నాయకుడు చేస్తున్న రాజకీయం వెగటు పట్టిస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సమయానికి తగు పాట పాడమన్నారు.. ప్రస్తుతం ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లకు కోత పెడుతున్నారు. దివ్యాంగులు.. ఇతరత్రా పింఛన్లు తీసుకునేవారికి కొన్ని షరతులు విధించారు.
దీంతో ఆయా వర్గాలు ఇక్కట్లు పడుతున్నాయి. వారికి వచ్చే నెల పింఛను వచ్చే వరకు ప్రాణాలు అరచే తిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు వారికి కావాల్సింది.. తమ తరఫున గళం వినిపించేవారు. వారి తరఫున నిలబడేవారు. కానీ, ప్రత్యర్థి జగన్ మాత్రం.. తన తరఫున నిలబడే వారికోసం రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తన బాధను ప్రపంచ బాధ చేస్తున్నారు. తన గ్రాఫు, తన పార్టీ గ్రాఫును చూసుకోవడంలోనే ఆయన బిజీ అయ్యారన్న ఆక్రోశం జనంలో కనిపిస్తోంది.
ఇక, సూపర్ సిక్స్ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా.. చాలా మందికి సొమ్ములు చేరలేదు. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల కూడా ఇటీవల ఒప్పుకొన్నారు. మరి దీనిని జగన్ ఎందుకు విస్మరించారన్నది ముఖ్యం. అదేవిధంగా పాఠశాలల్లో మార్పులు.. విద్యార్థుల సంఖ్యలో కోతలు.. ఇలా ప్రస్తుత సమయానికి తగిన విధంగా సమస్యలు జనాల గుమ్మాల్లో వేలాడుతున్నాయి. వాటిని పట్టుకుని ఉద్యమిస్తే.. అసలైన రాజకీయ.. అసలైన కళాపోషణ అవుతుందన్నది పరిశీలకుల అంచనా. కానీ.. జగన్ మాత్రం ఇలా వచ్చి అలా పోయే గాలివాటం నిరసనలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.