పవన్ మీద జగన్ పంచ్ !

దాదాపు రెండున్నర గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించి అందులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చి ఆ మీదట కొంత సేపు జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబు చెప్పే కార్యక్రమాన్ని జగన్ నిర్వహించారు.;

Update: 2025-09-11 03:58 GMT

దాదాపు రెండున్నర గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించి అందులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చి ఆ మీదట కొంత సేపు జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబు చెప్పే కార్యక్రమాన్ని జగన్ నిర్వహించారు. ఆయన మొత్తం మీడియా సమావేశం అంతా చంద్రబాబును ఉద్దేశించే మాట్లాడారు, బీజేపీని కానీ పవన్ ని కానీ ఏమీ అనలేదు. బాబునే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

కూటమి మూడేళ్ళే అన్న జగన్ :

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీయే అని ఆయన ఈ సందర్భంగా పలు మార్లు ధీమా వ్యక్తం చేశారు. 2029 లో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ కూటమి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినా తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తెస్తామని చెప్పారు. అందువల్ల పీపీపీ విధానంలో టెండర్లు వేసి ఎవరైనా దక్కించుకుంటే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని కూడా ఆయన కోరారు.

పవన్ ఏమి చూస్తాడు స్వామీ :

ఈ నేపధ్యంలో ఒక పాత్రికేయుడు జగన్ ని ఉద్దేశించి ఆసక్తికరమైన ప్రశ్ననే సంధించారు. మీరు అధికారంలోకి వస్తామని అంటున్నారు. కానీ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో రానీయకుండా చూస్తామని పవన్ అంటున్నారు కదా అని ప్రస్తావించారు. దానికి బదులిచ్చిన జగన్ పవన్ చూసేదేమిటి స్వామీ అని ఆ విలేఖరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పైన దేవుడు, తమ వెంట ఉన్న ప్రజలే అన్నీ చూస్తారు అని జగన్ తన మీడియా ప్రసంగాన్ని ముగించారు.

వారి మీదనే ధీమానా :

జగన్ ఎపుడూ చెప్పేది అదే ఉంటుంది. 2014 నుంచి ఆయన అదే మాట అంటూ వస్తున్నారు. పైన దేవుడున్నాడు, ప్రజలు ఉన్నారు వారే అన్నీ చూస్తారు అని చెబుతూంటారు. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఇపుడు కూడా అదే అంటున్నారు. దేవుడు ప్రజలు తనకు ఈసారి తప్పకుండా అధికారం కట్టబెడతారు అన్న నమ్మకం అయితే ఆయనలో ఉంది అని మాటల బట్టే అర్థం అవుతోంది అని అంటున్నారు. ఈసారి గురి తప్పకుండా అధికారంలోకి వస్తామని కూడా జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

పొత్తులు ఉన్నా కూడా :

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పవన్ ఏ సందర్భంలో ఈ మాటలు అన్నారో కూడా చూడాలి. టీడీపీ కూటమి పొత్తు మరో పదిహేనేళ్ల పాటు కొనసాగుతుందని అంటూ జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానీయకూడదని ఈ పొత్తులు కొనసాగిస్తామని చెప్పారు. అంటే ఈ పొత్తులు ఉంటే వైసీపీ రాదన్న రాజకీయ లెక్కలతోనే పవన్ ఈ మాట చెప్పారు. మరి ఆ విషయం అలా ఉంటే పొత్తులు పెట్టుకుని కూటమి ఒక్కటిగా వచ్చినా సరే 2029లో వైసీపీ తప్పకుండా గెలుస్తుంది అన్న ధీమా అయితే జగన్ లో ఉందా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. దానికి ఆయన రెండు విషయాలు చెప్పారు. పైన దేవుడు దీవెనలు ఓట్లేసే ప్రజల అనుకూలత ఉంటే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీ గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి కూటమిగా వచ్చినా వైసీపీ ఈసారి గెలిస్తే జగన్ రికార్డు కొట్టినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News