జగన్ ముందు నిజాలు చెప్పేస్తారా ?
గతంలో రాజుల పాలన ఉన్నపుడు కూడా ప్రతీ మూడు నెలలకు ఒక మారు మారు వేషాలలో రాజులు జనం వద్దకు వెళ్ళేవారు.;
గతంలో రాజుల పాలన ఉన్నపుడు కూడా ప్రతీ మూడు నెలలకు ఒక మారు మారు వేషాలలో రాజులు జనం వద్దకు వెళ్ళేవారు. వెంట మంత్రులను కూడా తీసుకెళ్ళేవారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కోసమే ఇదంతా. తాము ఏమి చేశాం, ఎలా చేశాం జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఇంకా ఏమి చేయాలి ఇవన్నీ తెలియాలీ అంటే జనాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా అవసరం.
మరి ఏ సమాచార వ్యవస్థ బలంగా లేని రోజులలో ఇలా చేశారు అంటే ఇపుడు ఎంతలా దానిని వాడుకోవాలి. వైసీపీ అధినాయకత్వం మాత్రం తనకు అంతా తెలుసు అనుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. ప్రజలలో ఉండే పార్టీ నాయకుల పెదవి సమావేశాలలో విప్పనీయరు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోరు. జగన్ ఏ సమావేశం నిర్వహించినా కూడా తానే అంతా మాట్లాడేస్తూ ఉంటారు అని చెబుతారు.
ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని తామే మళ్ళీ వస్తామని ధైర్య వచనాలు చెప్పి ముగించేస్తారు అని అంటున్నారు. అయితే జగన్ ఓటమి చూశాక మొదటి సారి వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ని తాడేపల్లిలో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ఇపుడు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు.
ఈ సమావేశంలో పీఏసీలో పునర్వ్యవస్థీకరించిన తరువాత పాత వారు కొత్త వారు యువత అంతా కలసి 33 మంది దాకా వచ్చారు. వారంతా గ్రౌండ్ రియాలిటీ బాగా తెలిసిన వారు అని అంటున్నారు. వారు పార్టీ ఫ్యూచర్ గురినిచి చెప్పాల్సి ఉందని అంటున్నారు. ఏమి చేస్తే ఫ్యాన్ మళ్ళీ జోరు చేస్తుందో కూడా వారు చెప్పాల్సి ఉందని అంటున్నారు.
మరి జగన్ యధా ప్రకారం తానే మాట్లాడేసి ముగించేస్తే కొత్తగా పునర్ వ్యవస్థీకరించిన పీఏసీ వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు. ఇక జగన్ సైతం వాస్తవాలను తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. పీఏసీలో సీనియర్లు ఉన్నారు కాబట్టి వారు వైసీపీ ప్రజెంట్ పొజిషన్ ఏమిటి అన్నది కళ్ళకు కట్టినట్లుగా వివరించాలని అంటున్నారు.
లేకపోతే మాతం తూతూ మంత్రంగానే మీటింగ్ జరుగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ తీరు మారాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆయన ఇంకా ఓల్డ్ స్టైల్ లో ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ ని ఆయన చేస్తున్నారు అని అంటున్నారు. అలా చేస్తూ పోతే వైసీపీకి ఇబ్బందే అవుతుందని అంటున్నారు.
నిజానికి చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ లో పాలిటిక్స్ ని స్టార్ట్ చేసిన వారు. అయితే ఆయన మాత్రం అప్ టూ డేట్ గా ఉంటున్నారు జగన్ మాత్రం జనాలకు తాము చేసింది గుర్తు పెట్టుకుంటారు అనే భావనలో ఉన్నారని అంటున్నారు. ప్రతీ అయిదేళ్ళకూ రాజకీయం మారుతుందని ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ టైం లో ప్రజలు ఎంతో చైతన్యం అయ్యారని వారు కూడా తమకు ఊరటను ఇచ్చే హామీలను కోరుకుంటున్నారని తాము ఫలానా చేయలేమని నాయకుడు ఎప్పుడూ చెప్పకూడదని అలా చెబితే జనాలు పట్టించుకోరని అంటున్నారు.
ఇక ప్రజలు దేవుడు అని జగన్ తరచూ చెబుతూంటారని, కానీ పార్టీ అన్నది అత్యంత ముఖ్యమని దానిని గట్టిగా నిర్మించుకుంటేనే జగన్ చెప్పిన ఆ ఇద్దరూ సహకరిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా పీఏసీ భేటీ వైసీపీకి ఉపయోగపడేలా అధినాయకుడుకి గ్రౌండ్ రియాలిటీస్ తెలిసేలా సాగితేమే ప్రయోజనం అని అంటున్నారు. సో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.