రెండేళ్లపాటు జనంలోనే జగన్.. 2.0 పాదయాత్ర @ 5,000 కి.మీ.!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరోసారి చారిత్రక పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.;

Update: 2025-11-29 10:07 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరోసారి చారిత్రక పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు దాదాపు 3,650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి 151 సీట్లతో అధికారాన్ని చేపట్టిన జగన్.. మళ్లీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు తదుపరి ఎన్నికల్లో గెలుస్తున్నారనే సెంటిమెంటు కూడా జగన్ ను రెండోసారి పాదయాత్ర చేసేలా ఉసిగొల్పుతోందని అంటున్నారు. ఈ సారి దాదాపు 5,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని భావిస్తున్న జగన్.. ఇప్పటి నుంచి అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టిపెట్టారని అంటున్నారు.

2029 ఎన్నికల వరకు జనంలోనే ఉండాలని భావిస్తున్న మాజీ సీఎం జగన్.. ప్రజలకు చేరువ అవ్వాలనే ఏకైక లక్ష్యంతో 5,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం ఎన్నికలకు రెండేళ్ల ముందు ఈ పాదయాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల నోటిఫికేషన్ వరకు జనంలోనే ఉండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారని అంటున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో దూరం పెరిగిందనే విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నారని అంటున్నారు. ఆయనను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఉండేది కాదని, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చేవారు కాదన్న ఆరోపణలు విస్తృతంగా ప్రచారం జరిగాయి. అప్పటి ప్రతిపక్షం కూడా ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. ఉదయం 9 గంటల తర్వాత తాడేపల్లిలోని తన నివాసం నుంచి పక్కనే ఉండే సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి.. సాయంత్రం 5 గంటలకు మళ్లీ వెళ్లిపోయేవారని... ఉదయం, సాయంత్రం వేళల్లో ఎవరినీ కలిసేవారు కాదని జగనుపై విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఈ కారణంతోనే ప్రజలతో సంబంధాలు దెబ్బతిని గత ఎన్నికల్లో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకున్నారని విశ్లేషణలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ చెడ్డపేరును దూరం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న జగన్.. తానెప్పుడూ జనం మనిషినే అని నిరూపించుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే 2.0 పాదయాత్రను భారీగా చేపట్టాలని నిర్ణయించారని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా.. ప్రతి మండలం టచ్ చేసేలా మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్రను డిజైన్ చేయాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మానసికంగా, శారీరంగా సిద్ధమవడానికి జగన్ కూడా ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు.

ఏపీలో ఇప్పటివరకు ఐదుగురు నేతలు పాదయాత్రలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుగా ఈ రాజకీయ యాత్రను చేసి సక్సెస్ అయ్యారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ సోదరి షర్మిల 2014 ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేశారు. వైఎస్ కేవలం 1600 కిలోమీటర్లు నడిస్తే.. చంద్రబాబు 2800 కిలోమీటర్లు నడిచారు. ఇక షర్మిల 3 వేల కిలోమీటర్ల మైలురాయిని స్థాపించారు. అయితే షర్మిల పాదయాత్ర వల్ల వైసీపీకి విజయం దక్కకపోగా, ఆ తర్వాత ఆమె పార్టీకి దూరమయ్యారు. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 3650 కిలోమీటర్లు పర్యటించారు. ఏపీ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక దూరం సాగిన పాదయాత్రగా రికార్డు నెలకొల్పారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ యువనేత నారా లోకేశం చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా 3200 కిలోమీటర్ల మేర సాగింది. సుమారు 4 వేల కిలోమీటర్లు ప్రయాణించాలని లోకేశ్ అనుకున్నా సాధ్యపడలేదు. ఇక జగన్ ఇప్పుడు 5 వేల కిలోమీటర్లను టార్గెట్ పెట్టుకోవడమే ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News