నిర్మలమ్మ బడ్జెట్.. మొదలుపెట్టిన కాంగ్రెస్.. ఎస్పీ, మమత నిప్పులు!

తాజా బడ్జెట్ దాని, దాని చుట్టూ ఏర్పడిన హైప్ కంటే చాలా తక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.;

Update: 2026-02-01 10:31 GMT

కేంద్ర బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సుమారు 80 నిమిషాలకు పైగా ప్రసంగించిన ఆర్థిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్ లో రెండు ప్రత్యేకతలు ఉండగా.. అందులో ఒకటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాగా.. వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డ్ సృష్టించారు. ఆ సంగతి అలా ఉంటే.. బడ్జెట్ పై కాంగ్రెస్ నుంచి కామెంట్స్ మొదలైపోయాయి!

అవును.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సమయంలో విపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఈ బడ్జెట్ పై పెదవి విరుస్తున్నాయి. ఈ సందర్భంగా... నిర్మలా సీతారామన్ ప్రజెంటేషన్ హైప్ కు చాలా తక్కువగా ఉందని.. ఖర్చు ప్రాధాన్యతలపై స్పష్టత కొరవడిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మరోవైపు ఈ బడ్జెట్ పూర్తిగా ఉన్నత వర్గాల కోసం రూపొందించినట్లుగా ఉందని సమాజ్ వాదీ పార్టీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. పత్రాలను వివరంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. తాజా బడ్జెట్ దాని, దాని చుట్టూ ఏర్పడిన హైప్ కంటే చాలా తక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. సుమారు 90 నిమిషాల ప్రసంగం తర్వాత కూడా ప్రధాన పథకాలు, కేటాయింపుల స్పష్టమైన చిత్రాన్ని అందించడంలో 2026-27 బడ్జెట్ విఫలమైందని.. ఇది పూర్తిగా నిరుత్సాహంగా ఉందని తెలిపారు.

మరోవైపు... తాజా బడ్జెట్ పై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ... ప్రభుత్వం తన బడ్జెట్ లను ఉన్నత వర్గాల కోసం రూపొందిస్తుందని ఆరోపిస్తూ... ఆశ లేని ప్రభుత్వం నుండి ఒకరు ఏమి ఆశించగలరని ప్రశ్నించారు. ఇదే క్రమంలో... ఈ బడ్జెట్ కేవలం 5శాతం మంది ప్రజల కోసమే రూపొందించబడిందని విమర్శిస్తూ... ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుందా అని విలేకరులతో మాట్లాడుతూ సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో తాజా కేంద్ర బడ్జెట్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వం విద్యా రంగానికి ఏమీ చేయలేదని.. పశ్చిమ బెంగాల్ కు కేటాయింపులను కేంద్రం ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ప్రధానంగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని భావిస్తున్నందువల్లే పశ్చిమ బెంగాల్ ను పక్కన పెట్టారని ఆమె ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News