వైఎస్‌ జగన్‌ కు కొంచెం మోదం.. కొంచెం ఖేదం!

గతంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సీఎం హోదాలో డిప్లొమాటిక్‌ పాస్‌ పోర్టు ఉండేది.;

Update: 2024-09-12 07:30 GMT
వైఎస్‌ జగన్‌ కు కొంచెం మోదం.. కొంచెం ఖేదం!

తన కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి లండన్‌ పర్యటనకు వెళ్లాలనుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు పాస్‌ పోర్టు విషయంలో ఆటంకాలు ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లండన్‌ వెళ్లాల్సిన ఆయన పర్యటన వాయిదా పడింది.

గతంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సీఎం హోదాలో డిప్లొమాటిక్‌ పాస్‌ పోర్టు ఉండేది. అయితే ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యేనే మాత్రమే కావడంతో డిప్లొమాటిక్‌ పాస్‌ పోర్టు రద్దయింది. దీని స్థానంలో సాధారణ పాస్‌ పోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అయితే విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది కాలానికే మాత్రమే జగన్‌ కు పాస్‌ పోర్టు ఇవ్వాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ఐదేళ్ల కాలపరిమితితో పాస్‌ పోర్టు ఇవ్వాలని ఏపీ హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనకు ఐదేళ్ల వ్యవధితో పాస్‌ పోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు పెట్టిన ఇతర షరతులు, నిబంధనలు వర్తిస్తాయని ఏపీ హైకోర్టు జగన్‌ కు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా హాజరై రూ.25 వేలు పూచీకత్తు చెల్లించాలని హైకోర్టు జగన్‌ కు ఆదేశాలు జారీ చేసింది. తాను కోర్టుకు రావడం వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయని, అలాగే ట్రాఫిక్‌ కు ఇబ్బంది వల్ల ప్రజలకు సమస్య ఏర్పడుతుందని జగన్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు, అయితే హైకోర్టు జగన్‌ తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. జగన్‌ విజయవాడ కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది.

విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించింది. ఈ విషయం ప్రజా జీవితంలో ఉన్న జగన్‌ కు బాగా తెలుసని వెల్లడించింది. విజయవాడ ప్రత్యేక కోర్టులో జగన్‌ పై దాఖలైన పరువు నష్టం కేసు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం జగన్‌ కు తెలుసని వ్యాఖ్యానించింది. ఇదే కేసు విచారణలో భాగంగా జగన్‌ కు సహ నిందితుడుగా ఉన్న వ్యక్తి విచారణకు హాజరవుతున్నారని చెప్పింది. కానీ జగన్‌ మాత్రం హాజరుకావడం లేదని ఆక్షేపించింది.

విచారణకు హాజరు కాని జగన్‌ తనకు అవసరమైనప్పుడు మాత్రం కోర్టులను ఆశ్రయిస్తున్నారని హైకోర్టు గుర్తు చేసింది. పరువు నష్టం కేసులో తనకు సమన్లు అందలేదని.. అందువల్ల తనను పూచీకత్తు సమర్పించాలని విజయవాడ న్యాయస్థానం ఆదేశించలేదనే జగన్‌ వాదన ను కోర్టు తప్పుబట్టింది. కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నానని ఓవైపు చెబుతూనే.. మరోవైపు పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్‌ ప్రశ్నిస్తున్నారని ఆక్షేపించింది. జగన్‌ కు ఐదేళ్ల కాల పరిమితితో పాస్‌ పోర్ట్‌ జారీకి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వాలని విజయవాడ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. పూచీకత్తు, తదితర అంశాల్లో జగన్‌ విజయవాడ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Tags:    

Similar News