జగన్ విత్ మోడీ : ట్వీట్ తో గ్రీట్ !
ఏపీలో రాజకీయం ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది.;
ఏపీలో రాజకీయం ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. టీడీపీ కూటమి అంటే అందులో జనసేన బీజేపీ కూడా ఉనాయి. ఈ మూడు పార్టీలు ఎన్డీయేగా ఏపీలో పాలన సాగిస్తున్నాయి. ఈ మూడు పార్టీలే ఏపీలో 2024 మధ్య వరకూ అధికారంలో ఉన్న వైసీపీని పట్టు బట్టి మరీ గద్దె దించేశాయి. దాంతో సహజంగానే వైసీపీకి ఈ మూడు ప్రతిపక్షమే కావాలి. కానీ వైసీపీ మాత్రం టీడీపీనే గట్టిగా టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో అపుడపుడైనా జనసేనని విమర్శిస్తుంది, కానీ బీజేపీని పల్లెత్తు మాట అనదు. దాంతో పాటుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అవసరమైన సందర్భాలలో మద్దతు కూడా ఇస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ అభ్యర్ధికి ఓటు వేయడం.
మోడీకి కంగ్రాట్స్ :
తాజాగా చూసుకుంటే నరేంద్ర మోడీకి ఏపీలో వైసీపీ అధినేత జగన్ కంగ్రాట్స్ చెప్పారు. ఎందుకు అంటే మోడీ పాతికేళ్ళ అధికార రాజకీయ ప్రస్తానం మీద గుజరాత్ సీఎం గా మోడీ తన ప్రయాణం మొదలెట్టి ముమ్మారు సీఎంగా పనిచేశారు. అలాగే మరో ముమ్మారు ప్రధానిగా నెగ్గి దేశానికి సేవ అందిస్తున్నారు. దాంతో మోడీ పాతికేళ్ళ అధికార రాజకీయ పండుగని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించి జనాలతో పంచుకున్నారు. దాంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఎండీయే రాజకీయ పక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్డీయేతర రాజకీయ పక్షాల నుంచి చూస్తే కనుక జగన్ నుంచి మాత్రమే మోడీకి గ్రీటింగ్స్ అందాయి.
మెచ్చుకుంటూ మరీ :
మోడీ ప్రజా సేవను ఆయన సుదీర్ఘ ప్రయాణాన్ని మెచ్చుకుంటూ జగన్ ట్వీట్ చేయడం విశేషం. దాంతో దీని మీద ఇపుడు చర్చ అయితే సాగుతోంది. సాధారణంగా ఒక దేశ ప్రధాని ఇలాంటి అరుదైన ఫీట్ ని సాధించిన నేపధ్యంలో ప్రశంసించడంలో తప్పు అయితే లేదు. ఎవరైనా చేయవచ్చు. కానీ ఏపీలో రాజకీయం కానీ దేశ రాజకీయం కానీ చూస్తే ఆ విధంగా అయితే లేదు. రెండు శిబిరాలుగా మారి హోరా హోరీ పోరుగా అంతటా సాగుతోంది. ఈ నేపధ్యంలో జగన్ ట్వీట్ మాత్రం రాజకీయంగానూ చర్చగానే ఉంది. మోడీ పట్ల వైసీపీ అభిమానం అలాగే ఉందా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తోంది. వాస్తవంగా చెప్పాలీ అంటే వైసీపీ జాతీయ స్థాయిలో
ఏ కూటమిలో లేదు, ఎన్డీయే కానీ ఇండియా కానీ ఆ పార్టీ చూపు అయితే వాటి మీద లేదు. అయితే సనర్భం వస్తే మాత్రం ఎన్డీయే వైపే చూపు ఉంటుందని అంటున్నారు. దానికి అనేక ఉదాహరణలు ఉంటే ఇపుడు ఈ ట్వీట్ కూడా జత చేరిందని అంటున్నారు.
కూటమికి కంఫ్యూజన్ :
ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇలా ఎన్డీయే సారధి కేంద్ర స్థాయిలో ప్రధాని అయిన మోడీని గ్రీట్ టో కన్ను గీటడం అంటే కూటమికి కంఫ్యూజన్ గానే ఉంటుంది అని అంటున్నారు. అదే సమయంలో రాజకీయాలు ఎపుడూ డైనమిక్ గా ఉంటాయి. ఇవి పరిస్థితులు అవసరాలు ఇచ్చి పుచ్చుకోవడాల మీదనే ఆధారపడి ఉంటాయి. బీజేపీ వరకూ చూస్తే కేంద్ర పెద్దలకు ఏపీలో ఏ పార్టీని దూరం చేసుకునే ఆలోచన లేదని అంటున్నారు. ఎందుకంటే వారి ఆ అగత్యం కూడా లేదని అంటున్నారు జాతీయ స్థాయిలో తమ రాజకీయ ప్రభ వెలగాలి అంటే వచ్చిన వారిని తమను నచ్చిన వారిని ఆకర్షిస్తూనే పోతారు అని అంటారు. దానికి గతంలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మరి ఏపీ రాజకీయం చూస్తే అలాంటి చదరంగం ఏమైనా ఉంటుందా అంటే ఏమో రాజకీయం అంటేనే అలాంటిది. ఎవరు చెప్పగలరు అన్నదే దానికి అచ్చమైన జవాబు.