మాజీ సీఎం జగన్ టూర్ ఎఫెక్ట్.. వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసు షాక్ ట్రీట్మెంట్!

కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.;

Update: 2025-11-05 09:42 GMT

కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా పోలీసు విధినిర్వహణకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో సహా పలువురిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు జగన్ రాగా, ఆయన పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలు అతిక్రమించారని పోలీసులు చర్యలకు సిద్దమయ్యారు.

కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనకు పది కార్లు, 500 మంది కార్యకర్తలు, నాయకులకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కానీ, పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. ఎక్కడికక్కడ రోడ్ షో చేయడంతోపాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా జగన్ వాహన శ్రేణిలో దాదాపు 70 నుంచి 80 కార్లతో హల్ చల్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల వల్ల గండిగుంట గ్రామంలో పరస్పరం వాహనాలు ఢీకొని పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసు విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ వంటి ఆరోపణలతో వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

జగన్ పర్యటన సందర్భంగా డ్రోన్ విజువల్స్ చిత్రీకరించిన పోలీసులు, ఆ వీడియో పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. జగన్ తాడేపల్లి నుంచి పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు, గూడురు మీదుగా ప్రయాణించగా, విజయవాడ-బందరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో డ్రోన్ వీడియో పుటేజీ ద్వారా ట్రాఫిక్ సమస్యలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో గోపువానిపాలెం గ్రామం వద్ద ట్రాఫిక్ సమస్య తేవొద్దని సీఐ చిట్టిబాబు వారిస్తే, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ ఆయనతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

మరోవైపు జగన్ పర్యటనపై అధికార పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా, పంటల బీమా ఎగ్గొట్టిన జగన్ ఇప్పుడు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించింది మరోవైపు తుఫాన్ వెళ్లిన వారం రోజులుకు తీరిగ్గా వచ్చిన ప్రతిపక్ష నేత, తుఫాన్ సమయంలో ఎక్కడున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తు చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ సహాయక చర్యలపై తమను తప్పుపట్టడంపై మంత్రి లోకేశ్ కూడా స్పందించారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే జగన్.. ఎప్పుడూ జనం మధ్య ఉన్న తమను వేలెత్తిచూపడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఒక వేలు ఎత్తి చూపుతున్నారు. కానీ ఆయనపైపు నాలుగు వేళ్లు ఉన్నాయనే విషయాన్ని మరచిపోతున్నారంటూ లోకేశ్ దెప్పిపొడిచారు.



Tags:    

Similar News