మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చేసుకోవడమేనట..
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ప్రతి జిల్లా కేంద్రం లేదా ముఖ్యమైన పట్టణాల్లో మెడికల్ కాలేజీ నిర్మించాలని గత ప్రభుత్వం భావించింది.;
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ కూడా పార్టీ పెద్దలు రెడీ చేశారని చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీ నేతలు, కార్యకర్తల ద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ భావించారు. కానీ, తొలిసారిగా ఆయనే రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారని అంటున్నారు.
వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్.. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మెడికల్ కాలేజీ పరిశీలన, ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా చేయడమనే అంశాలనే పరిశీలిస్తున్నా, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఒక రోజు దీక్ష చేయాలనే ప్రతిపాదన కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ప్రతి జిల్లా కేంద్రం లేదా ముఖ్యమైన పట్టణాల్లో మెడికల్ కాలేజీ నిర్మించాలని గత ప్రభుత్వం భావించింది. 17 కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుని 5 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మిగిలిన 12 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో పునఃసమీక్షించింది. ఆర్థిక భారం అనే కారణంగా దాదాపు 10 కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రతిపాదిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రజలకు భారం చేయొద్దని వాదిస్తోంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని చెబుతోంది. కూటమి ప్రభుత్వ ఆలోచన ప్రకారం పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ వైసీపీ నేతలు ఇప్పటికే ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్నారు. గతంలో మామిడి, పొగాకు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు జగన్ గుంటూరు, బంగారుపాళ్యం, పొదిలి మార్కెట్ యార్డులకు వెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఇదే సమయంలో విద్యార్థులు, రైతుల సమస్యలపై ఆందోళనలు నిర్వహణకు ఆదేశాలిచ్చిన వైసీపీ అధినేత.. తాను మాత్రం స్వయంగా ఎక్కడా పాల్గొనలేదు. ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనకు దిగాలని జగన్ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.