జగన్ కాన్వాయ్ ఢీకొట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ
మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఎటువంటి అపశృతి చోటుచేసుకోలేదని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు.;
మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఎటువంటి అపశృతి చోటుచేసుకోలేదని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు. తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళుతున్న జగన్ కాన్వాయ్ గుంటూరు బైపాస్ వద్ద ఏటుకూరు జంక్షన్ లో వృద్ధుడు సింగయ్యను ఢీకొట్టిందని, ఆ ప్రమాదంలో ఆయన మరణించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అధికార పార్టీ టీడీపీ కూడా ట్విట్టర్ లో స్పందించింది. ‘ఇంకా ఎంత మందిని బలితీసుకుంటావ్’ అంటూ జగన్ ను ప్రశ్నించింది. అయితే ఈ ఘటనపై గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి జగన్ కాన్వాయ్ కి సంబంధం లేదంటూ ఎస్పీ స్పష్టం చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో మాజీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళుతున్న జగన్ కాన్వాయ్ ఢీకొనడంతో సింగయ్య అనే వృద్ధుడు మరణించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేయగా, ప్రమాదానికి జగన్ కాన్వాయ్ కారణం కాదని తేలిందని ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు. సింగయ్యను AP26CE0001 నెంబరు గల టాటా సఫారీ వాహనం ఢీకొట్టినట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. సింగయ్యను ఢీకొట్టిన తర్వాత వాహనం డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హైవే పెట్రోలింగ్ ఎస్ఐ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన 108కి ఫోన్ చేసి గుంటూరు జీజీహెచ్ కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో సింగయ్యను గుంటూరు తరలించేలోపే మరణించినట్లు ఎస్పీ వెల్లడించారు. సింగయ్య కుటుంబం ఫిర్యాదు చేస్తే వాహనం డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని తెలిపారు. సింగయ్య మరణానికి జగన్ కాన్వాయ్ కి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. కాగా, జగన్ పర్యటనలో సత్తెనపల్లిలో మరొకరు మరణించారని వార్తలు వస్తున్నాయి. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జరిగిన తోపులాటలో ఆటోనగర్ కి చెందిన పాపసాని జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు చెబుతున్నారు.