సినిమా పేరు చెప్పరు.. హీరో మాదిరి చేస్తారు.. మాటలు సింక్ కావట్లేదు జగనన్నా?

కానీ.. ఇలాంటి విషయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.;

Update: 2025-06-20 07:50 GMT

గతంలో మాదిరి పరిస్థితులు.. ప్రజలు లేరు. ఒకప్పుడు ఏదైనా సమాచారం రావాలంటే పరిమిత మాధ్యమాలు మాత్రమే బయటకు వచ్చేవి. దీంతో ప్రజల స్పందన అందుకు తగ్గట్లు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మీడియాకు మించి సోషల్ మీడియా.. వీటితో పాటు వీడియోలు.. వాట్సాప్ మెసేజ్ లు.. ఇలా ఒకటికి మించిన మాధ్యమాలు మస్తుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వేళ.. చెప్పిందే కాదు.. చెప్పకుండా దాచే విషయాల్ని గుర్తించే పరిస్థితి. అందునా అందరికి సుపరిచితమైన అధినేతలు మాట్లాడే కొన్ని మాటల్ని నిశితంగా చూడటం.. ప్రతి మాటకు అర్థం.. దాని పరమార్థం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంతే అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది.

కానీ.. ఇలాంటి విషయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన క్యాంపు కార్యాలయంలో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధుల్ని పిలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి సవివరంగా పలు అంశాల మీద మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఒక ప్రశ్నను ఆయనకు సంధించారు.‘‘మీ కార్యకర్తలు రప్పారప్పా నరుకుతామంటూ ఫ్లెక్సీలు పెట్టారని విమర్శిస్తున్నారు’’ అని ప్రశ్నించగా.. అందుకు ఊహించని విధంగా రియాక్టు అయ్యారు జగన్మోహన్ రెడ్డి.

విలేకరి అడిగిన ప్రశ్నకు వ్యంగ్యంగా స్పందించిన జగన్.. పూర్తి డైలాగ్ చెప్పాలన్నారు. దీంతో.. సదరు విలేకరి సదరు డైలాగ్ చెప్పగా.. జగన్ వ్యాఖ్యానిస్తూ.. ‘గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు.. రప్పారప్పా నరికేస్తా అన్నారా? అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా? సినిమా డైలాగులు పెట్టినా తప్పే.. ఫోటోలు పెట్టినా తప్పే.. గడ్డం ఇలా అన్నా.. అలా అన్నా తప్పేనా? అంటూ సదరు సినిమా (పుష్ప) సినిమాలో హీరో చేసినట్లుగా చూపిస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఇక్కడే జగన్ ను తప్పు పడుతున్నారు పలువురు. సినిమా పేరు చెప్పలేదు కానీ.. సినిమాలో హీరో చేసినట్లు (మెడను చేతితో ఒకవైపు చూపిస్తూ తగ్గేదేలే అన్న) హావభావాన్ని ప్రదర్శించటం సింక్ కావట్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. జాతరలో పొట్టేళ్లను రప్పారప్పా నరికేయటం.. టీడీపీ వాళ్లను నరికేస్తాననటం ఒకటే అవుతుందా? అన్నది ప్రశ్న. అయినా.. హింస ఏ రూపంలో ఉన్నా.. వాటిని సమర్థించటం.. స్వాగతించటం సరికాదు కదా? అన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నారు?

విధ్వంసకర పార్టీని భూస్థాపితం చేస్తామన్న మాటకు అదే పనిగా అక్రోశించే ఆయన.. పొట్టేళ్లను నరికినట్లుగా నరికేస్తానంటూ రక్తదాహాన్ని ప్రదర్శించే వారిని సమర్థించటం ఎంతవరకు సబబు? హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడేటప్పుడు.. తాను కూడా ఆ తరహాలోనే వ్యాఖ్యలు చేయకూడదు కదా? ఒకవైపు వేలెత్తి చూపిస్తున్న అంశాన్నే.. తాను ప్రస్తావించటం ఎంతవరకు సబబు? అన్నది అసలు ప్రశ్న. ఈ తరహా వ్యాఖ్యలు ప్రజలకు పాజిటివ్ సందేశాన్ని కాక.. ప్రతికూల సందేశాన్ని పంపుతుందన్న వాస్తవాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నది ప్రశ్న. మాట్లాడే మాటలు.. చేసే చేష్టలు ఒకదానికి ఒకటి సింక్ అయ్యేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ కు చేస్తున్న సూచనను ఆయన చెవికెక్కించుకుంటారా? అన్నది అసలు ప్రశ్న.

Tags:    

Similar News