'రప్పా రప్పా అంటే తప్పేందబ్బా?'... జగన్ ఏమి చెప్పాలనుకుంటున్నారు?
వైసీపీ అధినేత జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.;

వైసీపీ అధినేత జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీల్లో రాసిన డైలాగులపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటికి చొటు లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జగన్ స్పందించారు.
అవును... "2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ..!" అంటూ బుధవారం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోన్న వేళ.. వైఎస్ జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఆ తరహా తీరును వెనకేసుకు రావడం గమనార్హం.
ఈ సందర్భంగా స్పందించిన జగన్... "గంగమ్మతల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తా" అని పోస్టర్ పెట్టారు. అది 'పుష్ప' సినిమా డైలాగ్. అది పోస్టర్ లో పెట్టినా తప్పేనా..? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..? పుష్పలో ఫొటోలు పెట్టినా, (యాక్షన్ చేసి చూపిస్తూ!) గడ్డం చేతితో అటు రుద్దుకున్నా.. ఇటు రుద్దుకున్నా తప్పేనా?" అని కాస్త వ్యంగంగా స్పందించారు!
ఇదే సమయంలో... "ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉందట.. అంటే.. టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషం పడదాం.. తెలుగుదేశం పార్టీని రప్పా.. రప్పా.. కోసేస్తా అని అంటున్నాడని ఆనందపడదాం" అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అది సినిమాలో డైలాగ్ అన్న విషయం ఆ ఫ్లెక్సి పెట్టిన వ్యక్తితో పాటు, జగన్ తో పాటు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే.. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో అలాంటి డైలాగులకు చోటు ఉందా అనేది ప్రశ్న! ఆ ఫోస్టర్ పెట్టిన యువకుడు ఏదో ఆవేశంగానో, అజ్ఞానంతోనో పెట్టాడనుకున్నా.. అతడి పని పోలీసులు చూసుకుంటారు.
అయితే... ఐదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్.. ఇలాంటి విషయాల్లో కార్యకర్తలను మందలించాలి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లకార్డులు ప్రదర్శించినవారిపై చర్యలు తీసుకోవాలి.. అది లేదు సరికదా... అవి సినిమా డైలాగులని, అవి కూడా చెప్పుకున్నా తప్పేనా అని మాట్లాడటం ఏమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదని అంటున్నారు పరిశీలకులు!
సమాజంలో ఉద్రిక్తతలు రేపే ఇంకా చాలా డైలాగులు చాలా సినిమాల్లో ఉంటాయి.. వాటిలో కొన్ని బూతులు కూడా ఉంటాయి. వాటన్నింటిని కూడా పోస్టర్స్ లో పెట్టి ప్రదర్శించమని జగన్ చెబుతున్నారను కోవాలా.. లేక, తన కార్యకర్తలు ఫ్లెక్సీల్లో పెట్టిన ఆలోచనే తన మనసులో కూడా ఉందని, తనకు మరోసారి అధికారం ఇస్తే జరిగేది అదే అని చెప్పాలనుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!:
జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై తాజాగా చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించారు.. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారు.. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా? చంపండంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారు అని చెప్పిన చంద్రబాబు... సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
ఇందులో భాగంగా... సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని.. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లు, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారని.. రాజకీయం చేస్తే వదిలిపెట్టనని.. తాట తీస్తా అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆ వ్యక్తి చనిపోయారని చెప్పిన చంద్రబాబు.. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శా? అని ప్రశ్నించారు.