6 కోట్ల మార్క్ దాటేసింది.. 2 రోజుల్లో ఇంకెన్నో?
ప్రతి ఏడాది జులై చివరి వారంలో వార్షిక ఆదాయపన్ను రిటర్న్స్ ను దాఖలు చేయటం మామూలే.;
ప్రతి ఏడాది జులై చివరి వారంలో వార్షిక ఆదాయపన్ను రిటర్న్స్ ను దాఖలు చేయటం మామూలే. ఈ ఏడాది అందుకు భిన్నంగా దాదాపు రెండు నెలల పాటు అదనపు సమయాన్ని ఇచ్చింది ఆదాయపన్ను శాఖ. ఈ నెల 15న (అంటే సోమవారం) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేసేందుకు అవకాశముంది. గడువు లోపు పన్ను రిటర్నును దాఖలు చేయకుంటే ఏమవుతుందన్న సందేహం కొందరికి కలగొచ్చు.
గడువు లోపు పన్ను రిటర్ను దాఖలు చేయకుంటే అపరాధ రుసుముతో దాఖలు చేయాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు ఆలస్యంగా దాఖలు చేస్తే.. రూ.వెయ్యి జరిమానాగా విధిస్తారు. అదే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు మాత్రం రూ.5 వేలు చెల్లించి పన్ను రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేసమయంలో చెల్లించని పన్ను మొత్తానికి నెలకు ఒక శాతం చొప్పున వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక.. ఇప్పటివరకు దాఖలైన ఆదాయపన్ను రిటర్నులు ఆరు కోట్లకు పైనే ఫైల్ అయ్యాయి. గత ఏడాది జులై 31 నాటికి గడువు ముగిసే సమయానికి 7.28 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అదే 2023లో 6.77 కోట్లుగా ఉన్నాయి. గడువు నాటికి గత ఏడాదికి మించి రిటర్నులు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. ఈసారి దాఖలయ్యే రిటర్నులు 8 కోట్ల మార్కును దాటేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరెన్ని రిటర్ను దాఖలు అవుతాయో చూడాలి. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో కొత్త ఆదాయ పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్న ఆర్థిక మంత్రి మాటల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
అయితే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన రూ.12 లక్షల మినహాయింపు గత ఏడాదికి సంబంధించింది కాదు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందన్నది మర్చిపోకూడదు. అంటే.. వచ్చే ఏడాది దాఖలు చేసే ఆదాయ పన్ను రిటర్ను ల నుంచి అమలవుతుంది. సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమవుతున్న వేళ.. ఈ విషయంపై అవగాహన కలిగి ఉండటం అవసరం.