హైదరాబాద్ లోని బిర్యానీ హౌజ్ లపై ఐటీ డాడులు?
దేశంలోనే కాదు.. ప్రపంచంలో సైతం బిర్యాని అంటే హైదరాబాద్ పేరే చెప్పాలి. అద్భుతమైన బిర్యాని తెలంగాణలోని హైదరాబాద్ సొంతం.;
దేశంలోనే కాదు.. ప్రపంచంలో సైతం బిర్యాని అంటే హైదరాబాద్ పేరే చెప్పాలి. అద్భుతమైన బిర్యాని తెలంగాణలోని హైదరాబాద్ సొంతం. ఇది నగర సంస్కృతిలో కలిసి పోయింది. ఎంతలా అంటే.. ‘హైదరాబాద్ అంటే బిర్యానీ. బిర్యానీ అంటే హైదరాబాద్’ అనేలా.. ఇంతలా నగర సంస్కృతిలో కలిసిపోయిన ఈ వంటకం చుట్టూ పెరిగిన వ్యాపారాలు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ రాడార్‌లోకి వచ్చాయి. పిస్తా హౌస్, షా ఘౌస్, మెహ్ఫిల్.. నగరంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన బిర్యానీ హౌజ్ లు. ఈ మూడు బ్రాండ్‌లపై మంగళవారం (నవంబర్ 18, 2025) ఉదయం ఐటీ విస్తృతంగా విచారణ ప్రారంభించింది. పన్నుల ఎగవేతపై అనుమానాల నేపథ్యంలో ఈ సంస్థలకు చెందిన ఆఫీసులు, ఇళ్లపై 30 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిగాయి.
ప్రపంచ గుర్తింపు సంపాదించుకున్న పిస్తా హౌజ్..
పిస్తా హౌస్ రంజాన్ హలీం నుంచి 24/7 బిర్యానీ వరకూ గ్లోబల్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థకు పలు కార్యాలయాలు, గోదాంలు, సరఫరా కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో బిల్లింగ్ పద్ధతులు, క్యాష్ ఫ్లో, ఆన్‌లైన్ డెలివరీ లావాదేవీలను అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. 2006లో చిన్న హోటల్‌గా ప్రారంభమైన మెహ్ఫిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో 15 బ్రాంచులు, అదనంగా UAEలో కూడా అవుట్‌లెట్లు నడుపుతోంది. ఇంత భారీ విస్తరణ సమయంలో పన్ను చెల్లింపుల్లో ఏమైనా లోపాలున్నాయా? అన్న అంశంపై విచారణ సాగుతోంది. భారీ దూకుడు, అతి వేగంగా పెరిగిన టర్నోవర్‌పై అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం.
గచ్చిబౌలి, టోలిచౌకి, చార్మినార్ వైపు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో బ్రాంచులు కలిగిన షా ఘౌస్ ను కూడా ఐటీ శాఖ ఆసక్తిగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్స్‌లో భారీ ఆర్డర్లు, ఆన్‌లైన్ బిల్లింగ్, క్యాష్ కలెక్షన్ల మధ్య గ్యాప్‌లు ఉన్నాయా అనే కోణంలో దాడులు జరిగాయి. బ్రాంచ్-వైజ్ లావాదేవీలు, సప్లయ్ చైన్, ఉద్యోగుల వివరాలు, రా మెటీరియల్ కొనుగోలు రికార్డులు, పేమెంట్స్ అన్నింటినీ అధికారులు స్కాన్ చేస్తున్నారు. పలుచోట్ల కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, అకౌంట్స్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల ప్రభావం ఏమిటి?
నగర ప్రజలు, ఫుడ్ లవర్స్, వ్యాపారులు అందరూ ఇదే ప్రశ్న వేస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ వ్యాపారం ఏటా వేల కోట్ల టర్నోవర్ చేస్తుందని అంచనా.. కానీ చిన్న బిల్లులు, క్యాష్ లావాదేవీలు, ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ మధ్య వ్యత్యాసాలు పన్ను శాఖ దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఈ దాడులు సాధారణ రొటీన్ చెకింగ్ కాదు.. పెద్దస్థాయి విచారణకు సంకేతం అనే భావన బలపడుతోంది.
ప్రస్తుతం స్పష్టత ఒక్కటే హైదరాబాద్‌లో అత్యధిక అమ్మకాలున్న బిర్యానీ చైన్లు ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఫుడ్ లవర్‌గా మనం బిర్యానీకి లైన్‌లో నిలబడటమే చేస్తాం.. కానీ పైనుంచి చూస్తే ఈ ఇండస్ట్రీలో డబ్బు ప్రవాహం ఎంత భారీదో గుర్తుచేస్తున్నాయి. ఇక ఐటీ విచారణ తర్వాత ఈ చైన్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.