సొంతూరే స్వర్గం.. ₹1.4 లక్షల జీతం కంటే ₹40 వేలే మేలు అంటున్న ఐటీ ఉద్యోగి!
తాజాగా ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన, మెట్రో నగరాల రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటిని.. ఒంటరితనాన్ని మరోసారి బయటపెట్టింది.
మనం దేనికోసం పరుగెడుతున్నాం.. కంటి నిండా నిద్ర, గుండె నిండా ప్రశాంతతను ఇచ్చే సొంత గూటిని వదిలేసి.. కాంక్రీట్ వనాల్లో దేని కోసం వెతుకుతున్నాం? లక్షల్లో జీతం, చేతిలో క్రెడిట్ కార్డులు, వీకెండ్‌లో పబ్‌లు.. ఇవేనా జీవితం?
తాజాగా ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన, మెట్రో నగరాల రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటిని.. ఒంటరితనాన్ని మరోసారి బయటపెట్టింది. "బెంగళూరులో ₹1.4 లక్షల జీతం వస్తున్నా నేను సంతోషంగా లేను.. నా సొంతూరిలో ₹40 వేల జీతంతో ఉన్నప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉన్నాను" అంటూ అతను రాసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో లక్షలాది మంది వలస జీవుల కళ్లను తడిచేస్తోంది.
ఆకాశమంత జీతం.. అంతకుమించిన ఖర్చులు!
ఆ ఉద్యోగి తన పోస్ట్‌లో నగర జీవితంలోని కఠిన వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వివరించాడు. నెల తిరిగేసరికి అకౌంట్‌లో ₹1.4 లక్షల జీతం పడుతున్నా చేతిలో చివరకు రూపాయి కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగళూరు వంటి నగరాల్లో ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉండాలన్నా జీతంలో సగం భాగం అద్దెలకే కరిగిపోతోంది. నిత్య నరకం చూపే ట్రాఫిక్ వెంటాడుతుంది.. ఆఫీస్‌కు వెళ్లడానికి, రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు, సమయం మనుషులను మానసికంగా కుంగదీస్తున్నాయి. కరెంట్ బిల్లులు, నిత్యావసరాలు, మెయింటెనెన్స్, వారాంతపు ఖర్చులు.. ఇలా ఒకదాని వెనుక ఒకటి వచ్చి జీతాన్ని మింగేస్తున్నాయి. "లక్షల్లో ప్యాకేజీలు ఉన్న మాట నిజమే.. కానీ ఆ ఖర్చులన్నీ పోయాక మిగిలేది సున్నా. పైగా రోజువారీ ఒత్తిడి, కాలుష్యం మనుషులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి." అని ఆవేదన వ్యక్తం చేశాడు.
₹40 వేల జీతమే.. కానీ రాచరికపు జీవితం!
ఒకప్పుడు తన సొంతూరిలో ₹40 వేల జీతంతో పనిచేసిన రోజులను ఆ ఉద్యోగి గుర్తుచేసుకున్నాడు. ఆ తక్కువ డబ్బుతోనే ఎంతో సౌకర్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపానని చెప్పాడు. అమ్మ చేతి వంట సొంత ఇల్లు ఉండడంతో అద్దెలు కట్టాల్సిన పనిలేదు, హోటల్ తిళ్ల గొడవ లేదని తెలిపాడు. కల్తీ లేని బంధాలుంటాయని.. ఆఫీస్ అయిపోగానే స్నేహితులతో కాసేపు, కుటుంబంతో మరికొంత సమయం గడిపే వీలుండేదని తెలిపారు. ఖర్చులు తక్కువ కావడం వల్ల ఆ ₹40 వేలలోనే దాచుకోవడానికి వీలయ్యేది. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో వేలాది మంది ఉద్యోగులు ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు.
నిజమైన స్వర్గం ఎక్కడ ఉంది?
కోవిడ్ తర్వాత 'వర్క్ ఫ్రమ్ హోమ్', 'హైబ్రిడ్' విధానాలు రావడంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు తిరిగి తమ పల్లెలకు, చిన్న పట్టణాలకు వెళ్ళిపోయారు. తక్కువ ఖర్చుతో, కుటుంబానికి దగ్గరగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని నిరూపించారు.
ఈ ఐటీ ఉద్యోగి లేవనెత్తిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. డబ్బు వెంట పరుగెడుతూ జీవితాన్ని కోల్పోవడం ముఖ్యమా? లేక తక్కువతో తృప్తి పడుతూ ప్రశాంతంగా బతకడం ముఖ్యమా? అన్నది ఐటీ నిపుణులు ఆలోచించుకోవాలి..