చరిత్ర సృష్టించిన భారత్... 6,100 కిలోలు ..ఎల్వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం

అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ మరో ఘనత సాధించింది.;

Update: 2025-12-24 04:47 GMT

అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ మరో ఘనత సాధించింది. ఇందులో భాగంగా... శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ - షార్ నుంచి బుధవారం చేపట్టిన రాకెట్ "ఎల్వీఎం3-ఎం6" ప్రయోగం విజయవంతమైంది. దీంతో.. అమెరికాకు చెందిన అధునాతన కమ్యునికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ - 2 ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

అవును... ఇస్రో ఓ ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. ఇందులో భాగంగా... "ఎల్వీఎం33-ఎం6" ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు కాగా.. అమెరికాకు చెందిన ఏ.ఎస్.టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

వాస్తవ షెడ్యూల్ కు సుమారు 90 సెకన్ల ఆలస్యంగా ఉదయం 8:55:30 గంటలకు మొదలైన ఈ ప్రయోగం మొత్తం మూడు దశల్లో పూర్తయ్యింది. ఇందులో భాగంగా... పైన చెప్పుకున్న సమయానికి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లగా.. బయలుదేరిన 15 నిమిషాల తర్వాత "బ్లూ బర్డ్ బ్లాక్-2" ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయింది. ఈ సమయంలో భూమి నుంచి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది.

ఈ బ్లూ బర్డ్ బ్లాక్ - 2 మిషన్ ప్రధాన లక్ష్యం.. శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలని. ఫలితంగా... ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఎవరికైనా.. ఏ సమయానికైనా 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్, మెసేజెస్, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది.

90 సెకన్లు ఆలస్యం ఎందుకంటే..?

లాంచ్ వెహికల్ మార్క్ 3 - ఎం6 (ఎల్వీఎం3-ఎం6) రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో జాగ్రత్త వ్యవహరించి 90 సెకన్లు ఆలస్యం చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి తొలుత 8:45 గంటలకు లిఫ్ట్ ఆఫ్ చేయాలని నిర్ణయించారు కానీ.. తర్వాత 8 గంటల 55 నిమిషాల 30 సెకన్లకు మార్చారు. దీనికి కారణం... ఈ రాకెట్ ప్రయాణిస్తున్న మార్గంలో శిథిలాలు లేదా ఇతర ఉపగ్రహాలతో ఢీకొనే అవకాశం ఉందని ఇస్రో నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే 90 సెకన్లు ఆలస్యం జరిగింది. శ్రీహరికోటపై ఉన్న స్థలం పై నుంచి వేలాది ఉపగ్రహాలు ప్రయాణిస్తుండటంతో రద్దీగా మారిందని అంటున్నారు.

స్పందించిన ఇస్రో చీఫ్!:

ఈ సందర్భంగా స్పందించిన ఇస్రో చీఫ్ డాక్టర్ వి నారాయణన్... భారత నేల నుంచి ఇప్పటివరకూ ప్రయోగించబడిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదని.. దీంతో భారత్ కొత్త మైలురాయిని అందుకుందని తెలిపారు. ఈ సందర్భంగా.. ఎల్వీఎం3 తన అద్భుతమైన ట్రాక్ రికార్డును కొనసాగించిందని తెలిపారు. ఈ మిషన్ తో భారత్ ఇప్పుడు 34 దేశాలకు 434 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయ్యిందని తెలిపారు.

ఈ ఎల్వీఎం3 మరోసారి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్లకు అవసరమైన ఖచ్చితత్వం, స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నందున ఈ విజయం గగన్ యాన్ కార్యక్రమంపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. ఇదే సమయంలో.. ఇస్రో చేతిలో ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు.

ఇస్రోను ప్రశంసించిన మోడీ!:

ఈ అద్భుతమైన ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా... భారత యువత శక్తితో, మన అంతరిక్ష కార్యక్రమం మరింత అభివృద్ధి చెందుతోందని.. ప్రభావవంతంగా మారుతోందని.. ఎల్వీఎం3 నమ్మకమైన హెవీ లిఫ్ట్ పనితీరును ప్రదర్శిస్తుండటంతో గగన్ యాన్ వంటి భవిష్యత్ మిషన్లకు తాను పునాదులను మరింత బలోపేతం చేస్తున్నామని.. వాణిజ్య ప్రయోగ సేవలను విస్తరించామని.. ప్రపంచ భాగస్వాములను మరింతగా పెంచుతున్నామని అన్నారు.

Tags:    

Similar News