చివరి నిమిషంలో ట్రంప్ సంచలన నిర్ణయం... వాన్స్ కీలక వ్యాఖ్యలు!

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు మరో టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-06-23 05:28 GMT

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు మరో టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య మొదలై, వీటి మధ్యే ముగిసిపోతుందని భావించిన యుద్ధం విస్తరించడం మొదలుపెట్టింది! ఇందులో భాగంగా... ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇరాన్ తరుపున తాము సిద్ధమంటూ యెమెన్ అధికారికంగా ప్రకటించింది.

పైగా... హార్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయించడంతో తదుపరి జరిగే పరిణామాలపైనా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో... ఇరాన్‌ కు అణ్వాయుధే కావాలంటే వాటిని సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూటీ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ వెల్లడించారు.

అలా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుగున్న యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు మారిపోయాయి. అటు ప్రపంచ చమురు వాణిజ్యం ఎలా మారుతుందనే ఆందోళన ఒక పక్క కాగా.. ఈ యుద్ధం ఏ స్థాయిలో విస్తరిస్తుందనే భయాందోళనలు మరొపక్క పెరుగుతున్నాయి. అయితే... ఇరాన్ పై దాడుల నిర్ణయం ట్రంప్ ఎప్పుడు తీసుకున్నారో చెప్పారు వాన్స్!

అవును... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధంలోకి అడుగుపెట్టిన అమెరికా.. టెహ్రాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. అయితే... ఈ దాడులకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి నిమిషంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. దాడులు చేయాలా వద్దా అనే విషయంపై ఆయన చివరి నిమిషం వరకూ సుదీర్ఘంగా ఆలోచించారని వాన్స్ వెల్లడించారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌.. ఇరాన్ పై దాడులు చేయాలా? వద్దా? అనేదానిపై ట్రంప్‌ సుదీర్ఘ ఆలోచన చేశారని.. బాంబులు వేయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఆయన తుది నిర్ణయం తీసుకున్నారని.. ఈ దాడులను ఆపే సామర్థ్యం ఆయనకు ఉన్నప్పటికీ.. ముందుకు వెళ్లడానికే మొగ్గు చూపారని వెల్లడించారు.

అయితే... ప్రస్తుతం అమెరికా దళాలపై ఇరాన్‌ ప్రతిదాడి చేస్తుందా? లేదా?.. లేక, తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా? అదీగాక.. చర్చలవైపు మొగ్గుచూపుతుందా? అనే దాన్ని అమెరికా నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. ఏది ఏమైనా... ఇరాన్ ప్రతిచర్యపై మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని ఓ ఇంటర్వ్యూలో వాన్స్ తెలిపారు.

ఇరాన్ కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు సిద్ధం!:

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందనే కారణంతోనే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ పై అమెరికా దాడులకు కారణం అదే విషయం. ఈ నేపథ్యలో ఇరాన్ కు అణ్వాయుధాల సరఫరాపై రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వదేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఇరాన్ కు అణ్వాయుధాలే కావాలంటే వాటిని సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల పేర్లైతే వెల్లడించలేదు కానీ... స్వయంగా అణ్వాయుధాలను కలిగి ఉన్న రష్యా.. ఇరాన్‌ కు సాయం చేయనుందా అన్న ఊహాగానాలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి.

Tags:    

Similar News