ఇస్కాన్‌ రెస్టారెంట్‌లోకి చికెన్‌.. రెచ్చగొట్టిన యువకుడు..

రెస్టారెంట్‌లో కేవలం శాకాహార వంటకాలు మాత్రమే ఉంటాయని సిబ్బంది చెప్పిన తర్వాత కూడా అతను తన కేఎఫ్‌సీ బాక్స్‌లోని చికెన్‌ను బయటికి తీసి, కౌంటర్ దగ్గరే తినడం మొదలుపెట్టాడు.;

Update: 2025-07-21 13:24 GMT

ఆధ్యాత్మికతకు, పవిత్రతకు ప్రతీకగా భావించే ఇస్కాన్‌ ఆలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన ఓ వివాదాస్పద ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. లండన్‌లోని ఇస్కాన్‌ గోవింద రెస్టారెంట్‌లో ఒక యువకుడు చికెన్‌ ఫాస్ట్‌ఫుడ్ తీసుకువచ్చి, శాకాహారానికి మాత్రమే పేరుగాంచిన ఆ ప్రదేశంలో తినడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, శాంత వాతావరణాన్ని భంగపరిచిందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక యువకుడు కేఎఫ్‌సీ చికెన్‌ బాక్స్‌తో ఇస్కాన్‌ గోవింద రెస్టారెంట్‌లోకి ప్రవేశించాడు. ఇస్కాన్‌ ఆలయాలు, వాటి అనుబంధ రెస్టారెంట్లు హిందూ సంప్రదాయాల ప్రకారం శుద్ధ శాకాహారాన్ని మాత్రమే అందిస్తాయి. వీడియోలో, మొదట ఆ యువకుడు "ఇక్కడ మాంసాహారం దొరుకుతుందా?" అని అడుగుతాడు. రెస్టారెంట్‌లో కేవలం శాకాహార వంటకాలు మాత్రమే ఉంటాయని సిబ్బంది చెప్పిన తర్వాత కూడా అతను తన కేఎఫ్‌సీ బాక్స్‌లోని చికెన్‌ను బయటికి తీసి, కౌంటర్ దగ్గరే తినడం మొదలుపెట్టాడు.

అంతేకాకుండా, ఆ యువకుడు తన చేతిలో ఉన్న చికెన్‌ను అక్కడి సిబ్బందికి, భక్తులకు చూపిస్తూ రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. అతని ఈ చర్య అక్కడి సిబ్బందిలో అసహనాన్ని రేపింది. వెంటనే సెక్యూరిటీ సహాయంతో అతడిని రెస్టారెంట్‌ బయటకు పంపించారు.

-నెటిజన్ల ఆగ్రహం, డిమాండ్లు

ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇది మతపరమైన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే చర్య” అని పలువురు అభివర్ణిస్తున్నారు. ఇస్కాన్‌ వంటిది ఓ పవిత్ర స్థలమని, ఇటువంటి ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తన కేవలం సంస్కృతిని అవమానించడం మాత్రమే కాకుండా, భక్తుల మనోభావాలను అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు ఈ చర్య వెనుక జాతివివక్ష కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. "హిందువులు శాంతవాదులు అని తెలిసి, కావాలని ఈ చర్యకు పాల్పడ్డాడా?" అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికల్లో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

-మత సామరస్యంపై ప్రశ్నార్థకం

ఆధ్యాత్మికతకు నిలయమైన ఇస్కాన్‌ ప్రాంగణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన భక్తుల మనసులను కలచివేసింది. మతపరమైన సహనాన్ని పరీక్షించేదిగా, ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తున్న ఈ సంఘటన సమాజంలో మత సామరస్యం, ఒకరి మతపరమైన ఆచారాలను గౌరవించడంపై చర్చను లేవనెత్తింది. పవిత్ర స్థలాల పట్ల ఇటువంటి అగౌరవ ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని నెటిజన్లు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News