మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా: ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న నగరంపై అమెరికా క్షిపణి దాడులు

ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మషద్ నగరంలోని ఒక కీలకమైన రైల్వే బ్రిడ్జ్‌పై అమెరికా క్షిపణి దాడి జరిపింది.

Update: 2026-07-09 15:42 GMT

మధ్యప్రాచ్యంలో ముగిసిపోయిందని భావించిన ఉద్రిక్తతలు మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల చివరి అంకం జరగనున్న మషద్ నగరాన్ని అలాగే అక్కడి కీలక అణు కేంద్ర పరిసరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా శనివారం తెల్లవారుజామున భారీ దాడులకు తెగబడింది. ఈ పరిణామంతో అమెరికా-ఇరాన్ మధ్య శతాబ్దాల నాటి వైరం మళ్లీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు

ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మషద్ నగరంలోని ఒక కీలకమైన రైల్వే బ్రిడ్జ్‌పై అమెరికా క్షిపణి దాడి జరిపింది. ఈ రైల్వే మార్గం కేవలం ఇరాన్ అంతర్గత రవాణాకే కాకుండా.. ఉత్తర ఇరాన్ నుండి రష్యా, చైనాలతో జరిగే అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత వ్యూహాత్మకమైనది.

మరోవైపు రష్యా సాంకేతిక సహకారంతో నిర్మించిన అత్యంత కీలకమైన బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాలపై కూడా అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ ఆరోపించింది. ఈ దాడుల వల్ల అక్కడ భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే ప్రస్తుతానికి అణు విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని.. ప్రాణనష్టం కూడా సంభవించలేదని స్థానిక అధికారులు ధృవీకరించారు.

కాల్పుల విరమణ ఒప్పందానికి తెరదించిన ట్రంప్

ఈ దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగి ఇరాన్‌లోని వ్యూహాత్మక, రక్షణ సంబంధిత లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ దాడులపై పెంటగాన్ నుంచి ఇంకా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇరాన్ ఎదురుదాడులు.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్

అమెరికా దాడులకు ఇరాన్ కూడా అంతే వేగంగా ప్రతిస్పందించింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఎదురుదాడులు ప్రారంభించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. అమెరికాకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హామాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రపంచానికి తాజా అమెరికా-ఇరాన్ యుద్ధం మరిన్ని సవాళ్లను తెచ్చిపెట్టేలా ఉంది.

ప్రపంచ మార్కెట్లపై ప్రభావం

ఈ ఆకస్మిక పరిణామాల వల్ల పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని.. ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఆరోపణలపై అమెరికా ఇచ్చే అధికారిక స్పందన కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News