కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. శరద్ పవార్ పార్టీ రివర్స్ ప్లాన్!
మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. చీలిక భయంతో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ సిద్ధమవుతుందన్న ప్రచారం నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. చీలిక భయంతో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ సిద్ధమవుతుందన్న ప్రచారం నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ (శరద్ పవార్) పార్టీకి చెందిన కీలక నేత జయంత్ పాటిల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం మర్యాదపూర్వక కలయికగానే ఈ భేటీని ఇరుపార్టీలు చెబుతున్నా, తెర వెనుక పెద్ద రాజకీయ డ్రామా నడుస్తోందన్న అనుమానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ‘ఆపరేషన్ టైగర్’ చేపట్టిన బీజేపీ మహారాష్ట్రలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలను శివసేన (షిండే) వర్గంతో చేతులు కలిపినట్లు చేసింది. ఇప్పుడు ఎన్సీపీ నేతలతోనూ బీజేపీ చర్చిస్తుండటంతో ఆపరేషన్ టైగర్-2 మొదలు పెట్టిందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజులుగా ఎన్‌సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. లోక్ సభలో 2/3 వంతు మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్న అధికార బీజేపీ విపక్షాలలో చీలికలను ప్రోత్సహిస్తోందని అంటున్నారు. బెంగాల్ ఎన్నికల అనంతరం ముందుగా తృణమూల్ తో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ మహారాష్ట్రలోని శివసేన మీదుగా ఎన్సీపీ వరకు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో చేరారు. అనంతరం మహారాష్ట్రలో ఆరుగురు శివసేన ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అనుకూలంగా చెబుతున్నారు. ఇప్పుడు ఎన్సీపీలో పరిణామాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే ఇప్పటికే ఒకసారి రెండుగా చీలిపోయిన ఎన్సీపీ ఇప్పుడు వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. చీలిక ప్రమాదం నివారించేందుకు శరద్ నేతృత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీఏకు మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
సుదీర్ఘకాలంగా ప్రతిపక్షంలో ఉండటంతో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని, తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఎన్సీపీ శరద్ పవర్ వర్గంలోని నాయకులు చెబుతున్నారు. దీంతో ఎన్డీఏకి మద్దతు ప్రకటించడం ద్వారా అధికార పక్షం వైపు మారాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన సమయంలో రెండు వర్గాల విలీనంపై చర్చలు జరిగాయి. ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గంతో చేతులు కలపడం ద్వారా తాము కూడా అధికారంలో భాగస్వామ్యం పొందవచ్చని శరద్ పవార్ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు భావించారు. అయితే అప్పట్లో కొన్నికారణాల వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. అయితే ఇప్పుడు రెండు వర్గాలు విలీనం అయ్యే ప్రతిపాదన లేకపోయినా, ఎన్డీఏకి మద్దతు పలకాలనే అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు.
ఇండి కూటమికి ఎదురుదెబ్బేనా..?
మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎన్‌సీపీ (శరద్ పవార్) కలిసి కూటమిగా వ్యవహరిస్తున్నాయి. మూడుపార్టీలు కలిపి అధికార ఎన్డీఏ కూటమితో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటువంటి తరుణంలో, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం ఎన్డీఏ వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి ఊహించని షాక్ అవుతుందని అంటున్నారు. ఇది కేవలం ఒక పార్టీ మార్పు మాత్రమే కాదని. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల వ్యూహాత్మక మార్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్, శివసేన (యూబీటీ) వ్యూహాలను దెబ్బతీయడంలో బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే, శరద్ పవార్ వర్గం మాత్రం తన మనుగడ కోసం భిన్నమైన ఆలోచనలు చేస్తోందన్న ప్రచారమే హీట్ పుట్టిస్తోంది.