అహంకార యుద్ధం ఎఫెక్ట్: అమెరికాపై 96 లక్షల కోట్ల ఆర్థిక భారం!
అంతర్జాతీయ రక్షణ రంగంలో ఇరాన్-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, సుదీర్ఘ సైనిక ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
అంతర్జాతీయ రక్షణ రంగంలో ఇరాన్-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, సుదీర్ఘ సైనిక ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రక్షణ పోరాటం వల్ల అమెరికాకు అయ్యే మొత్తం ఖర్చు ఏకంగా ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు (సుమారు 96 లక్షల కోట్ల రూపాయలకు) చేరవచ్చని ఆర్థిక రంగ నిపుణులు షాకింగ్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా రక్షణ శాఖ తాత్కాలిక కాంప్ట్రోలర్ జే హర్స్ట్ ప్రతినిధుల సభ కమిటీ విచారణలో మాట్లాడుతూ.. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల కోసం ఇప్పటివరకు అధికారికంగా 29 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇది కేవలం రెండు వారాల క్రితం కాంగ్రెస్‌కు సమర్పించిన 25 బిలియన్ డాలర్ల మునుపటి అంచనా కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
అయితే ఈ అధికారిక అంచనాలు చాలా తక్కువ చేసి చూపినవని హార్వర్డ్ విశ్వవిద్యాలయ యుద్ధ బడ్జెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధ క్షేత్రంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం.. అమెరికా కేవలం స్వల్పకాలిక రక్షణ కార్యకలాపాల కోసమే రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లను ముందస్తుగా ఖర్చు చేయాల్సి వస్తోంది. యుద్ధంలో రక్షణ పరికరాల నిరంతర మరమ్మత్తులు, క్షిపణుల నిల్వలు క్షీణించడం.. దాడుల వల్ల దెబ్బతిన్న సైనిక స్థావరాల పునర్నిర్మాణ వ్యయం బడ్జెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఘర్షణల ప్రారంభంలో కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే అమెరికా ప్రయోగించిన అత్యంత ఖరీదైన పేట్రియాట్ క్షిపణుల సంఖ్య.. గత నాలుగేళ్లలో ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన మొత్తం క్షిపణుల కంటే ఎక్కువ కావడం ఈ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ రక్షణ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేరుగా అమెరికా పౌరుల జేబులకు చిల్లు పెడుతోంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కోసం ఆ దేశస్థులు ఇప్పటివరకు అదనంగా దాదాపు నలభై బిలియన్ల డాలర్లు (సుమారు 3.80 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేశారని బ్రౌన్ విశ్వవిద్యాలయ సర్వే వెల్లడించింది. ఈ సంక్షోభం కారణంగా అమెరికాలోని ప్రతి ఇంటీపై 316 డాలర్ల అదనపు భారం పడింది. అక్కడ పెట్రోల్ ధరలు ఇప్పటివరకు యాభై ఒక్క శాతం పెరిగి గ్యాలన్ (మూడు పాయింట్ ఏడు లీటర్లు) 4.51 డాలర్లకు చేరగా, డీజిల్ ధర ఏకంగా యాభై నాలుగు శాతం పెరిగి గ్యాలన్ 5.65 డాలర్లకు పెరిగింది.
దేశీయంగా ఇంధన ధరల మంట ఒకవైపు పీడిస్తుంటే.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు .. విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఒకే రోజులో ఏకంగా ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. రక్షణ వ్యయం ఈ స్థాయిలో పెరిగిపోతుండటం వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులపై విపరీతమైన భారం పడటంతో పాటు దేశీయ ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. యుద్ధ క్షేత్రంలో మోహరించిన వేలాది మంది సైనికులకు భవిష్యత్తులో అందించాల్సిన దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ, వైకల్య బీమా పరిహారాల భారం రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఖజానాను మరింత కుంగదీయనుంది.
మొత్తంగా చూస్తే అమెరికా అంతర్గత అంచనాల ప్రకారం... తక్షణ నష్టాలు నలభై నుండి యాభై బిలియన్ డాలర్లుగా కనిపిస్తున్నా.. దీర్ఘకాలిక సైనిక విస్తరణ ప్రక్రియ కోసం ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దెబ్బతిన్న మౌలిక వసతులను బాగు చేయడానికి..ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి రక్షణ రంగానికి చెందిన దిగ్గజ ప్రైవేట్ సంస్థలతో అమెరికా భారీ కాంట్రాక్టులు కుదుర్చుకోవాల్సి వస్తోంది. ఈ యుద్ధ వ్యయం.. మార్కెట్ అస్థిరత ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా అగ్రరాజ్యం సాధించిన ఆర్థిక పురోగతి తీవ్రంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన అహంకారం, అతి ఇలానే కొనసాగితే, అమెరికా ద్రవ్యోల్బణంతో కుంగి దివాళా దిశగా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు!