అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రధానాంశాలు ఇవే.. అమలవుతాయా?
ఇరాన్-అమెరికా మధ్య గత 107 రోజులుగా అంతర్జాతీయ సమాజానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు పడేలా కనిపిస్తోంది.
ఇరాన్-అమెరికా మధ్య గత 107 రోజులుగా అంతర్జాతీయ సమాజానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు పడేలా కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ఒక కీలక శాంతి ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వైఖరిలో మార్పు వచ్చిందా? లేదా ఇరానే కొన్ని మెట్లు దిగి వచ్చిందా? అనే చర్చలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ 'మెహ్ర్ న్యూస్ ఏజెన్సీ' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది పూర్తిస్థాయి ఒప్పందానికి పునాది వేసే ఒక ప్రాథమిక అంగీకార పత్రం. ఇందులో భద్రత, ఆర్థిక వ్యవహారాలు, అణు కార్యక్రమాల నియంత్రణ, ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించిన అనేక కీలక ప్రతిపాదనలు ఉన్నాయి.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
లెబనాన్ సహా ఇరాన్ మద్దతు ఉన్న ప్రాంతాలపై అన్ని రకాల సైనిక చర్యలను అమెరికా వెంటనే నిలిపివేయాలి. అలాగే, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, దాని సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని 30 రోజుల్లోగా పూర్తిగా ఎత్తివేయాలి. మధ్యప్రాచ్యంలో మోహరించిన అదనపు అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవాలి.
హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్దేశించిన భద్రతా ప్రమాణాల ప్రకారం 30 రోజుల్లోగా తిరిగి తెరవాల్సి ఉంటుంది. ఇరాన్‌పై ఉన్న చమురు, పెట్రోకెమికల్ రంగాల ఆంక్షలను తొలగించి, ఆ ఆర్థిక లాభాలు పూర్తిగా ఇరాన్‌కే దక్కేలా చూడాలి.
భారీ ప్యాకేజీ, నిధుల విడుదల
అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలి. చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇందులో సగభాగం 12 బిలియన్ డాలర్లు ఇరాన్‌కు బదిలీ చేయాలి. యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ఇరాన్ పునర్‌నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి 300 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయ ప్రణాళికను రూపొందించాలి.
తాము అణ్వాయుధాల తయారీ చేపట్టబోమని అణు నిరోధక ఒప్పందం (ఎన్.పీటీ) ప్రకారం ఇరాన్ మరోసారి అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
భవిష్యత్తు కార్యాచరణ ఏంటి?
ఈ ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. అణు అంశాలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, ఐక్యరాజ్యసమితి , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీర్మానాలపై రాబోయే 60 రోజుల పాటు ఇరుదేశాలు ప్రత్యేకంగా చర్చలు జరపనున్నాయి.
ఈ శాంతి ఒప్పందం సజావుగా అమలు అయ్యేలా చూసేందుకు ఒక ప్రత్యేక పర్యవేక్షణ మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధికారిక ఆమోదం పొందడం తప్పనిసరి.
ప్రస్తుతానికైతే ఈ పీస్ డీల్ అంతర్జాతీయ మార్కెట్లకు, ముఖ్యంగా చమురు ధరల స్థిరీకరణకు పెద్ద ఉపశమనం కలిగించే అంశమే. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ డీల్ పూర్తిస్థాయిలో అమలు అవుతుందా లేక భవిష్యత్తులో సరికొత్త వివాదాలకు వేదికవుతుందా అన్నది వేచి చూడాలి.