టార్గెట్ 18 టెక్ కంపెనీలు.. దాడులు చేస్తామంటూ ఇరాన్ తాజా ప్రకటన
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అంతకంతకూ ముదురుతోంది.;
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఓవైపు అమెరికా బెదిరింపులు.. అదే సమయంలో కాస్తంత సర్దుబాట్లు.. మరికాస్తా వెనక్కి తగ్గినట్లే తగ్గుతూ.. అదే సమయంలో తీవ్ర ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇందుకు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఇరాన్ తీరు ఉంది. తమపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, అమెరికాలను దెబ్బ తీసేలా వారి నిర్ణయాలు ఉంటున్నాయి. తమ శత్రు దేశాలకు మద్దతుగా ఉన్న యూఏఈతో పాటు పలు దేశాలపై దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
ఇరాన్ జరుపుతున్న వ్యూహాత్మక దాడులతో పలు అరబ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడికి కౌంటర్ గా ఇరాన్ షాకింగ్ ప్రకటన చేసింది. ఓవైపు సంక్షోభాన్ని ముగించేందుకు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటల వేళ.. ఇరాన్ మాత్రం అనూహ్య రీతిలో చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు టెక్ కంపెనీలను ఉలిక్కిపడేలా చేసింది.
గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్.. ఇకపై తాము దిగ్గజ టెక్ కంపెనీలను టార్గెట్ గా చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తాము ఏయే టెక్ కంపెనీలపై దాడులు చేస్తామన్న వివరాలతో పాటు.. ఎందుకు ఆయా కంపెనీలపై దాడులకు సిద్ధమవుతున్న విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. సదరు టెక్ కంపెనీల పేర్లను వెల్లడించింది. తాము ప్రకటన చేసినట్లే.. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం తదితర అమెరికా కంపెనీలకు చెందిన యూనిట్లపై తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ వార్నింగ్ ఇచ్చింది.
తాము పేర్కొన్న కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే తక్షణమే వెళ్లిపోవాలని.. ఆయా కంపెనీలకు కిలోమీటర్ దూరం పరిధిలో ఉండే స్థానికులు సైతం తమ నివాసాల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. తమపై దాడుల లక్ష్యాన్ని గుర్తించే విషయంలో టెక్ కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని.. అందుకే ఆయా కంపెనీలను తమ లక్ష్యంగా పెట్టుకోవటం ద్వారా తమను గుర్తిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దాడుల లక్ష్యాన్ని గుర్తించే అంశంలో టెక్ కంపెనీలు కీలక భూమిక పోషిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఇక.. తమ లక్ష్యమంతా తాము గుర్తించిన 21 కంపెనీలను చెందిన ఉద్యోగులను దారుణంగా దెబ్బతీయటమేనని పేర్కొన్నారు. తాము టార్గెట్ చేసిన కంపెనీలకు కీలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులంతా తమ ప్రాంతాల్ని వదిలేసి..దూరంగావెళ్లాలన్న సూచన చేయటం ఉలిక్కిపడేలా చేసింది. అంతకంతకూ కోలుకోలేని రీతిలో ఇరాన్ ను తాము దెబ్బ తీశామని ఓవైపు ట్రంప్ చెబుతుంటే.. మరోవైపు తమ దాడుల పరిధిని పెంచుకుంటూ పోతున్న ఇరాన్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. ఇరాన్ చెబుతున్నట్లుగా అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలు పెడితే మాత్రం.. ఈ యుద్ధం మరింత ముదిరి.. ప్రపంచ దేశాలకుశాపంగా మారుతుందని చెప్పక తప్పదు.
ఇరాన్ టార్గెట్ లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలు ఇవే
- యాపిల్
- మెటా
- గూగుల్
- మైక్రోసాఫ్ట్
- ఇంటెల్
- ఐబీఎం
- డెల్
- టెస్లా
- బోయింగ్
- హెచ్ పీ
- జేపీ మోర్గాన్ తదితర సంస్థలు