ఇరాన్ గగనతలం మూసివేత... అలా బయటపడిన ఇండిగో విమానం!
ఇరాన్ లో పరిస్థితి గంటకు గంటకూ మరింత దిగజారిపోతుందని అంటున్నారు. మరోవైపు ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ నిర్ణయించినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.;
ఇరాన్ లో పరిస్థితి గంటకు గంటకూ మరింత దిగజారిపోతుందని అంటున్నారు. మరోవైపు ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ నిర్ణయించినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ కు దగ్గరలో ఖతార్ లోని తమ కీలక అల్-ఉదెయిద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.. ఈ సమయంలో ఇండిగో జస్ట్ మిస్ అయ్యింది!
అవును... హింసాత్మక నిరసనల నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలకు ఇరాన్ గగనతలాన్ని మూసివేసింది. ఈ సమయంలో... భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఇందులో భాగంగా... ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నామని.. ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని తెలిపింది.
ఈ నేపథ్యంలో.. ప్రయాణికులు అప్ డేట్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని.. ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం కానీ.. ఫైనల్ గా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యమని ఎయిరిండియా వెల్లడించింది. ఇదే సమయంలో ఇండిగో కూడా ఇదేతరహా అడ్వైజరీ జారీ చేసింది. ఇందులో భాగంగా... ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని సర్వీసులపై ప్రభావం పడిందని.. పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది.
ఇండిగో విమానం జస్ట్ మిస్!:
తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడానికి ముందు ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... గగనతలాన్ని మూసివేయడానికి కొన్ని నిమిషాల ముందు ఇండిగో విమానం అక్కడ నుంచి బయలుదేరింది. జార్జియా నుంచి బయల్దేరిన ఆ విమానం గురువారం తెల్లవారుజామున 2:35 గంటల ప్రాంతంలో ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించింది. అలా ప్రయాణించిన సుమరు 25 నిమిషాల తర్వాత.. అంటే 3 గంటల ప్రాంతంలో తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆ గగనతలాన్ని దాటిన చివరి ప్యాసింజర్ విమానంగా ఇండిగో నిలిచింది!
మరోవైపు ఇరాన్ గగనతలం ద్వారా సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో స్పష్టత కోసం ఎదురుచూస్తూ.. విమానయాన సంస్థలు, అంతర్జాతీయ ఆపరేటర్లు పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూ, ఆకస్మిక ప్రణాళికలు, రూట్ సర్దుబాట్లను సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా ఇరాన్ ను దాటే మార్గాల్లో ప్రయాణించే ప్రయాణీకులు విమానయాన నవీకరణల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. బయలుదేరే ముందు విమాన వివరాలను ఒకటికి రెండుసార్లు ధృవీకరించాలని సూచించారు.