ఇన్‌స్టాగ్రామ్ పరిచయం… చివరికి రూ.81లక్షలు స్వాహా!
ఈ మోసంలో పూజితా ఒక్కతే కాదు, రామలింగారెడ్డి అనే వ్యక్తి కూడా తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం అశోక్ దగ్గర నుంచి పలు విడతలుగా ఏకంగా రూ. 81,67,000 వసూలు చేశారు.;
సోషల్ మీడియాలో వచ్చే అందమైన అమ్మాయిల ఫోటోలు చూసి మురిసిపోతే ఏమవుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఒక కిలాడీ లేడి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బురిడీ కొట్టించి ఏకంగా రూ. 81 లక్షలకు పైగా నొక్కేసింది. ప్రేమ పేరుతో వల వేసి, నమ్మకంగా డబ్బులు లాగేసి, చివరికి అతడిని నట్టేట ముంచేసింది. కడప జిల్లాలో జరిగిన ఈ భారీ సైబర్ మోసం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
ఇన్‌స్టాలో పరిచయం.. ప్రేమగా మాటలు:
ఇక కడప జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'పూజితా' అనే పేరుతో ఉన్న ఒక ఐడి నుంచి పరిచయం ఏర్పడింది. మొదట్లో సరదాగా సాగిన మాటలు, ఆ తర్వాత ప్రేమగా మారాయి. నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతోనే నా జీవితం అంటూ ఆ యువతి అశోక్‌ను తన మాయమాటలతో పూర్తిగా నమ్మించేసింది.
పెళ్లి పేరుతో అసలు వేట మొదలు:
ఇక అశోక్ తనను గుడ్డిగా నమ్ముతున్నాడని గ్రహించిన పూజితా , మెల్లగా తన అసలు రంగు బయటపెట్టింది. రకరకాల కారణాలు చెబుతూ డబ్బులు అడగడం మొదలుపెట్టింది. తనకు ఏదో సమస్య ఉందని, అర్జెంట్‌గా అమౌంట్ కావాలని అశోక్‌ను కోరింది. ఇక ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె అడిగినప్పుడల్లా లక్షల్లో డబ్బులు పంపడం మొదలుపెట్టాడు.
రూ. 81 లక్షల భారీ స్కామ్:
ఈ మోసంలో పూజితా ఒక్కతే కాదు, రామలింగారెడ్డి అనే వ్యక్తి కూడా తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం అశోక్ దగ్గర నుంచి పలు విడతలుగా ఏకంగా రూ. 81,67,000 వసూలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అశోక్ కష్టపడి సంపాదించిన డబ్బునంతా లాగేసుకున్నారు. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న అశోక్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల రంగప్రవేశం:
బాధితుడు అశోక్ ఫిర్యాదుతో బద్వేల్ అర్బన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ మోసం ఎలా జరిగింది? డబ్బులు ఏ అకౌంట్లకు వెళ్లాయి? పూజితా రెడ్డి అసలు వ్యక్తిగత వివరాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యి ఉండి కూడా ఇలాంటి మోసాల బారిన పడటంపై పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖం చూడకుండా, కేవలం మెసేజ్‌లు, ఫోటోలు చూసి లక్షల రూపాయలు పంపడం ఆత్మహత్యతో సమానం. ఎంతటి చదువుకున్న వారైనా సరే, ఇలాంటి ఆన్‌లైన్ ప్రేమల విషయంలో అప్రమత్తంగా లేకపోతే అశోక్ లాగే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటేనే అది మోసమని గ్రహించడం మంచిది.